సార్ సినిమాలో మూర్తిగారికి నచ్చనిది

ఊహించిన దానికన్నా పెద్ద సక్సెస్ దిశగా సార్ అడుగులు వేస్తోంది. కేవలం మూడు రోజులకే రెండు భాషలకు కలిపి యాభై కోట్ల మార్కు దాటడం పెద్ద అచీవ్ మెంటే. ఈ సంబరాన్ని పంచుకునేందుకు నిన్న టీమ్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ జరుపుకుంది. ధనుష్ రాలేకపోయినా మిగిలిన బృందం మొత్తం హాజరై తమ సంతోషాన్ని సభావేదికగా వ్యక్తం చేసింది. తమిళ వెర్షన్ కన్నా తెలుగులోనే మంచి స్పందన దక్కడం దాని ప్రభావం ఓవర్సీస్ లోనూ స్పష్టంగా కనిపించడం చూస్తే సులభంగా ఓ పది రోజులు స్ట్రాంగ్ రన్ దక్కడం ఖాయమే. దగ్గరలో పెద్ద పోటీ లేదు.

ఈ వేడుకకు అతిథిగా వచ్చిన పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడుతూ సార్ క్లైమాక్స్ నచ్చలేదని అందరి ముందు అనేసి షాక్ ఇచ్చారు. విద్యార్థులు సాధించిన ఘనతను బాలు సార్ కి ఇవ్వకుండా ఇంకో రూపంలో ముగించారనేది ఆయన వెర్షన్. దాని గురించి వివరణ ఇస్తూ ఆ క్షణంలో అలా అనిపించినా తర్వాత కన్విన్స్ అయ్యానని దర్శకుడు వెంకీ అట్లూరి చాలా గొప్పగా భావోద్వేగాలను చూపించారని పొగిడారు. భాషతో రాష్ట్రంతో సంబంధం లేకుండా ధనుష్ అందరూ కోరుకునే స్టారని కితాబిచ్చారు. ఫిల్టర్ లేకుండా మాట్లాడే ఈయన స్టైల్ మరోసారి ఆకట్టుకుంది.

ప్రస్తుతం పీపుల్స్ స్టార్ కూడా విద్యా రంగంలో అవినీతి మీద యూనివర్సిటీ అనే సినిమా తీశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. పేపర్ లీకేజీ వ్యవహారాలు స్టూడెంట్స్ జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపించాయో ఇందులో పొందుపరిచారట. సార్ చూశాక తనకూ ధైర్యం వచ్చిందని, విషయం సీరియస్ గా ఉన్నా చెప్పే విధానం బాగుంటే ఆదరిస్తారని ప్రేక్షకులు ఋజువు చేశారు కాబట్టి యునివర్సిటీ హిట్ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి సార్ సాధించిన సక్సెస్ నారాయణమూర్తి లాంటి వాళ్ళను మెప్పించిందంటే విశేషమే.