నందమూరి తారకరత్న హఠాన్మరణం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ఇవాళ అంత్యక్రియల క్రతువు ముగియడంతో శాశ్వత సెలవు తీసుకోవడం భౌతికంగా పూర్తయ్యింది. అయితే ఇప్పుడీ పరిమాణం ఆ కుటుంబానికి సంబంధించిన షూటింగుల మీద ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అందులో మొదటిది అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న బాలయ్య 107. కొత్త షెడ్యూల్ ని ఈ వారంలోనే ప్లాన్ చేశారు. దానికి అనుగుణంగానే ఆర్టిస్టుల డేట్లు గట్రా తీసుకుని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఈలోగా తారకరత్న శివైక్యం జరిగిపోయింది.
తనతో బాలా బాబాయ్ అంటూ ఎంతో చనువుగా ఉండే అన్నకొడుకు కాలం చేయడం బాలయ్య తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే తండ్రి కంటే ఎక్కువ తనతో చనువుగా ఉండే ఇంటి కుర్రాడు ఇలా వెళ్లిపోవడం ఎంత బాధ కలిగిస్తుందో పార్థివ దేహం దగ్గర కళ్లారా చూడొచ్చు. ఈ మూడ్ లో మునుపటి ఎనర్జీతో నటించడం అంత సులభం కాదు. కోలుకోవడానికి కనీస సమయం అవసరం. సో పోస్ట్ పోన్ చేయడం లాంఛనమే. అధికారికంగా ప్రకటించకపోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ 30ని ఈ నెల 24న పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
ఇది కూడా వాయిదా వేశారని ఫిలింనగర్ టాక్. ఇలాంటి విపత్తులో తారక్ సైతం చిత్రీకరణ వైపు మొగ్గు చూపడం లేదని సమాచారం. ఇప్పటికే విపరీతమైన వాయిదాల పడినప్పటికీ మరో మార్గం లేదు కనక కొత్త డేట్ కోసం ప్లాన్ చేసుకోవాల్సిందే. గత కొన్ని నెలలుగా టాలీవుడ్ ని వరస మరణాలు వెంటాడుతూనే ఉన్నాయి. సత్యనారాయణ, జమున లాంటి అగ్ర సీనియర్ నటులతో మొదలుపెట్టి తారకరత్న లాంటి ఎంతో భవిష్యత్తు ఉన్న ఆర్టిస్టుల దాకా ఎందరో వెళ్లిపోవడం కలవరపరుస్తోంది. కరోనా తర్వాత పరిశ్రమ పూర్తిగా కోలుకున్నాక ఇలా జరగడం దురదృష్టకరం.
Gulte Telugu Telugu Political and Movie News Updates