నిర్మాత‌ల మండ‌లిలో దిల్ రాజు పాగా


తెలుగు నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌లు ఎన్న‌డూ లేనంత‌గా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి ఈసారి. అందుక్కార‌ణం.. మండ‌లి నుంచి వేరు ప‌డి.. ప్ర‌స్తుతం సినిమాలు తీస్తూ యాక్టివ్‌గా ఉన్న నిర్మాత‌ల‌తో క‌లిసి యాక్టివ్ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ అని కొత్త సంస్థ ఏర్పాటు చేసుకుని కార్య‌క‌లాపాలు న‌డిపిస్తున్న దిల్ రాజు వర్గం.. సి.క‌ళ్యాణ్ ఆధ్వ‌ర్యంలోని ప్యానెల్ మీద పోటీకి దిగ‌డ‌మే.

నిర్మాత‌ల మండ‌లిలో ఎప్ప‌ట్నుంచో క‌ళ్యాణ్ వ‌ర్గానిదే ఆధిప‌త్యం కాగా.. ఈసారి రాజు వ‌ర్గం ఆయ‌న్ని స‌వాల్ చేసింది. క‌ళ్యాణ్ వ‌ర్గాన్ని ఢీకొట్టి గెల‌వ‌డం రాజు టీంకు అంత తేలిక కాద‌నే అభిప్రాయాలే వ్య‌క్త‌మ‌య్యాయి ఎన్నిక‌ల ముందు. కానీ ఆదివారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాజు వ‌ర్గందే పైచేయి కావ‌డం విశేషం.

రాజు వ‌ర్గం నుంచి అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసిన దామోద‌ర్ ప్ర‌సాద్.. క‌ళ్యాణ్ వ‌ర్గం నుంచి బ‌రిలో నిలిచిన పి.కిర‌ణ్ మీద 14 ఓట్ల స్వ‌ల్ప తేడాతో విజ‌యం సాధించారు. ప్ర‌సాద్‌కు 339 ఓట్లు రాగా.. కిర‌ణ్ 315 ఓట్ల‌కు ప‌రిమితం అయ్యారు. దిల్ రాజు స్వ‌యంగా ఈసీ స‌భ్యుడిగా ఎన్నిక కాగా.. ఆయ‌న వ‌ర్గానికి చెందిన మ‌రో తొమ్మిది మంది ఈ ప‌ద‌వుల‌ను ద‌క్కించుకున్నారు. క‌ళ్యాణ్ వ‌ర్గం నుంచి అయిదుగురే ఈసీ స‌భ్యులు అయ్యారు.

ఇద్ద‌రు ఉపాధ్య‌క్షులు (భ‌ర‌త్ చౌద‌రి, న‌ట్టికుమార్) రాజు వ‌ర్గం నుంచే ఎన్నిక కాగా.. కార్య‌ద‌ర్శులు (వైవీఎస్ చౌద‌రి, ప్ర‌స‌న్న‌కుమార్) క‌ళ్యాణ్ వ‌ర్గం నుంచి అవ‌కాశం ద‌క్కించుకున్నారు. కోశాధికారిగా క‌ళ్యాణ్ వ‌ర్గానికి చెందిన రామ‌స‌త్య‌నారాయ‌ణ ఎన్నిక‌య్యారు. ఈసీ మెంబ‌ర్లుగా దిల్ రాజుతో పాటు దానయ్య, స్ర‌వంతి రవి కిషోర్, యలమంచిలి రవి, పద్మిని, బెక్కం వేణుగోపాల్, సురేందర్ రెడ్డి, గోపీనాథ్ ఆచంట, మధుసూదన్ రెడ్డి, కేశవరావు, శ్రీనివాద్ వజ్జ, అభిషేక్ అగర్వాల్, కృష్ణ తోట, రామకృష్ణ గౌడ్, కిషోర్ పూసలు ఎన్నిక‌య్యారు.