బాబాయితో నటించే కల నెరవేరకుండానే

నందమూరి తారకరత్న కన్నుమూత యావత్ నందమూరి అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తింది. వివాద రహితుడిగా సౌమ్యుడిగా పేరున్న తనకు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు ఉంది. నటించిన సినిమాలు కమర్షియల్ గా పెద్ద రేంజ్ కు వెళ్లకపోయినప్పటికీ నటనపరంగా ఎప్పటికప్పుడు తనను తాను ఋజువు చేసుకుంటూనే వచ్చాడు. దర్శకుడు రవిబాబు తీసిన అమరావతిలో విలన్ గా నంది అవార్డు సాధించడం దానికి నిదర్శనం. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకపక్క సెకండ్ ఇన్నింగ్స్ నడుపుతూనే రాజకీయాల్లోకి రావాలనుకున్న టైంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

తారకరత్నకు అందరికంటే బాలకృష్ణతోనే చనువు ఎక్కువ. బాలా బాబాయ్ అంటూ మురిపెంగా పిలుచుకుంటూ ఆయన సంతకాన్ని ఏకంగా పచ్చబొట్టు వేయించుకునేంత ప్రేమ చూపించేవాడు. ఇటీవలే ఓ పెళ్లి వేడుకలో ఇద్దరు కలిసి ముచ్చటించుకోవడం వీడియో రూపంలో వైరల్ అయ్యింది. అయితే ఈ బాబాయ్ అబ్బాయ్ కాంబోలో ఇప్పటిదాకా సినిమా రాలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం బాలయ్య చేస్తున్న 107వ చిత్రంలో తారకరత్నను విలన్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. నారా రోహిత్ రాజా చెయ్యి వేస్తేలో మెప్పించిన అనుభవం ఎలాగూ ఉంది.

కానీ విధి తలంపు మరోలా ఉంది. బాబాయ్ తో స్క్రీన్ పంచుకోవాలన్న తన కల నెరవేరకుండానే తారకరత్న సెలవు తీసుకున్నాడు. ఇది బాలయ్యకూ తీవ్ర మనస్థాపం కలిగించేదే. ఆ మధ్య 9 అవర్స్ వెబ్ సిరీస్ లో ఇన్స్ పెక్టర్ గా వెబ్ ఓటిటిలో అడుగు పెట్టిన తనకు ఆఫర్లు కూడా పెరిగాయి. యాక్టింగ్ ప్లస్ పొలిటికల్ రెండో బాలన్స్ చేసుకుంటూ వెళదామనుకున్న టైంలో ఈ దుర్ఘటన జరిగిపోయింది. 2002 లో ఒకటో నెంబర్ కుర్రాడుతో మొదలుపెట్టి ఇప్పటిదాకా పాతిక దగ్గరగా సినిమాలు చేసిన తారకరత్న చివరి చిత్రం మిస్టర్ తారక్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.