దేశం గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి ఇప్పుడు అనూహ్యంగా సోషల్ మీడియాలో ఒక వర్గం నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండేలా సినిమాలు తీస్తున్నాడని.. ఆ పార్టీ భావజాలాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని ఒక వర్గం ఆయనపై ఆరోపణలు గుప్పిస్తోంది. రాజమౌళి సినిమాల్లోని సన్నివేశాలను.. ఆయన వేషధారణను చూపిస్తూ విమర్శలు గుప్పిస్తోంది.
ఈ విమర్శలపై రాజమౌళి కూడా తాజాగా స్పందించాడు. తన సినిమాలకు, భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబందం లేదని.. తనకు అనిపించింది తాను తీశానని వివరిస్తూ.. నిజంగా తనకు ఆ పార్టీతో సంబందం ఉందో లేదో జనాలు నిర్ణయించుకుంటారని వ్యాఖ్యానించాడు. అలా ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు జక్కన్న.
ఐతే ఇప్పుడు ఈ టాపిక్‌లోకి వివాదాస్పద నటి కంగనా రనౌత్ వచ్చింది. రాజమౌళి చేసిన తప్పేంటి.. ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక మూవీ తీసి ప్రపంచ స్థాయిలో భారతీయ జెండా ఎగరేయడమా.. మన సంప్రదాయ వస్త్రధారణతో ప్రపంచ వేదికలపై మాట్లాడడమా అంటూ కంగనా దీర్ఘాలు తీస్తూ ఆయన్ని ట్రోల్ చేస్తున్న వారి మీద విరుకుపడింది. కంగనా కొన్నేళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ జపం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే ఒక దశ దాటాక మరీ శ్రుతి మించి భాజపా జపం చేయడం.. ఆ పార్టీ వ్యతిరేకులను టార్గెట్ చేయడం కంగనాకే కాదు.. బీజేపీకి కూడా చేటు చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాజమౌళి విషయంలో ఆమెది అనవసర జోక్యం లాగే కనిపిస్తోంది. ఆమె బీజేపీని అతిగా ఓన్ చేసుకుని చేసిన అతి వల్ల తమకు చేటే జరుగుతోందని బీజేపీ నెమ్మదిగా తనకు దూరం జరుగుతోంది. ఇలాంటి టైంలో రాజమౌళిని వెనకేసుకురావడం వల్ల ఆయనకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. భాజపాతో ఆయనకు మరింతగా సంబంధం అంటగట్టి ఇబ్బందుల పాలు చేయడం తప్ప కంగనా ఇచ్చే మద్దతు వల్ల ఏం ప్రయోజనం లేదన్నది స్పష్టం.
Gulte Telugu Telugu Political and Movie News Updates