బండ్ల పంచ్‌లు త్రివిక్రమ్‌కేనా?


బండ్ల గణేష్ టాలీవుడ్ స్టార్ హీరోలను ఎలా ఆకాశానికి ఎత్తేస్తుంటాడో తెలిసిందే. ఐతే పొగడ్తలకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే అని, అలా పొగిడితేనే హీరోలు అవకాశమిస్తారని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా బండ్ల గణేషే వ్యాఖ్యానించడం హైలైట్. కానీ ఈ మధ్య అతను హీరోలను ఎంతగా పొగుడుతున్నా ఎవ్వరూ అవకాశం ఇవ్వట్లేదు. తన దేవుడిగా బండ్ల పేర్కొనే పవన్ కళ్యాణ్ సైతం ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి మిన్నకుండిపోయాడు. తన రీఎంట్రీ పవన్ సినిమాతోనే ఉంటుందని చెప్పిన బండ్ల.. ఆ తర్వాత దాని ఊసు ఎత్తట్లేదు.

ఇటీవల కాలంలో రవితేజను అదే పనిగా పొగుడుతున్నాడు బండ్ల. దీన్ని బట్టి మాస్ రాజాతో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నాడేమో అన్న కామెంట్లు వినిపించాయి. కానీ అదేమీ వర్కవుట్ అయినట్లు లేదు. మళ్లీ పవన్ కోసం ప్రయత్నించినా.. ఫలితం లేకపోతోందో ఏమో.. తన అసహనాన్ని పరోక్షంగా బయటపెట్టేస్తున్నాడు బండ్ల.

తాజాగా బండ్ల గణేష్ కొన్ని సూక్తులను ప్రవచిస్తున్నాడు ట్విట్టర్లో. అందులో ఒక ట్వీట్ పరోక్షంగా పవన్ మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. “మోసం చేయాలనుకునేవాడు మేధావిలా నటిస్తాడు.. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ భక్తుడుగానే పొగరుగా ఉంటాడు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా”.. ఇదీ బండ్ల ట్వీట్.

ఇటీవల ‘అన్ ‌స్టాపబుల్’ షోలో పవన్ మాట్లాడుతూ.. త్రివిక్రమ్‌ను తాను గురువుగా భావిస్తానని చెప్పడం తెలిసిందే. అందరూ కూడా ఆయన్ని గురూజీ అంటారు. ఆయన్నో మేధావిలాగే చూస్తారు. ఇక బండ్ల ఏమో తనకు పవన్ దేవుడని, ఆయనకు తాను భక్తుడినని అంటుంటాడు. దీన్ని బట్టి చూస్తే త్రివిక్రమ్‌కు బండ్ల పంచ్ వేశాడన్నది స్పష్టం. ఆయన మీద ముందు నుంచి అసహనంతోనే ఉన్నాడు బండ్ల. పవన్‌కు తాను క్లోజ్‌గా లేకుండా, ఆయనతో తాను మరో సినిమా చేయకుండా చేస్తోంది త్రివిక్రమే అన్నది ఆయన ఫీలింగ్ కావచ్చు. అందుకేనేమో మరోసారి ఇలా తన అసహనాన్ని చూపిస్తున్నట్లున్నాడు.