బన్నీ దెబ్బకు సుక్కు పరుగులు


టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో పర్ఫెక్షన్ కోసం గట్టిగా ప్రయత్నించి.. సినిమాల మేకింగ్‌ను బాగా ఆలస్యం చేసే దర్శకుల్లో సుకుమార్ ఒకడు. స్క్రిప్టు తయారీ.. ప్రి ప్రొడక్షన్.. ప్రొడక్షన్.. అన్నింటి విషయంలోనూ సుక్కు బాగా టైం తీసుకుంటాడని పేరుంది. పుష్ప సినిమా విషయంలోనూ ఇదే జరిగి ఈ సినిమా పట్టాలెక్కడంలో.. షూటింగ్ పూర్తి చేసుకోవడంలో.. అలాగే రిలీజ్ విషయంలో ఆలస్యం జరిగింది. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్ కావడంతో సుక్కు మీద మరింత బాధ్యత పెరిగిపోయి… పుష్ప 2 స్క్రిప్టు మీద మళ్లీ కూర్చున్నాడు.

పుష్ప రిలీజైన ఏడాది తర్వాత కానీ ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లలేదు. ఈ సినిమా మేకింగ్ చాలా శ్రమతో కూడుకున్నది కావడం.. రెండో భాగం మీద ఉన్న అంచనాల దృష్ట్యా ప్రి ప్రొడక్షన్.. ప్రమోషన్ జాగ్రత్తగా చేయాల్సి రావడం.. ఈ చిత్రం రిలీజయ్యే భాషలు కూడా ఎక్కువైపోవడంతో 2023 రిలీజ్ మీద దాదాపుగా ఆశలు వదులుకున్నారు అభిమానులు. 2024 వేసవికి కానీ సినిమా రిలీజ్ కాకపోవచ్చని షూటింగ్ మొదలవుతున్నపుడు యూనిట్ సభ్యులు ఒక అంచనాకు వచ్చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్ మొదలయ్యాక కథ మారిపోయినట్లు సమాచారం. బాగా కసరత్తు చేయడం వల్ల సుకుమార్ ఈసారి కొంచెం వేగంగానే షూటింగ్ లాగిస్తున్నాడట. అంతే కాక బన్నీ సుక్కుకు ఒక డెడ్ లైన్ కూడా పెట్టేసినట్లు సమాచారం.

పుష్ప రిలీజైన డిసెంబరు 17వ తేదీకే దీన్ని తీసుకొద్దామని.. అందుకోసం తాను ఎంత కష్టపడ్డానికైనా, ఏం చేయడానికైనా రెడీ అని బన్నీ చెప్పాడట. దీంతో సుక్కు కూడా ఈ దెబ్బతో అలెర్ట్ అయిపోయాడట. ఇప్పటికే రెండు చిన్న షెడ్యూళ్లలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఒక లెంగ్తీ షెడ్యూల్ పెట్టుకున్నారు. దాదాపు నెల రోజులు సాగే ఈ షెడ్యూల్‌తో 40 శాతం సినిమా పూర్తయిపోతుందట. తర్వాత ఇంకో నాలుగు నెలలు ఇదే ఫ్లోతో కష్టపడితే షూట్ మొత్తం అయిపోతుంది. డిసెంబరు 17 టార్గెట్ పెట్టుకుంటే ప్రి ప్రొడక్షన్, ప్రమోషన్‌కు దాదాపు మూడు నెలల సమయం ఉంటుంది. గట్టిగా ప్రయత్నిస్తే ఆ డేట్ అందుకోవడం కష్టమేమీ కాదని టీం భావిస్తోంది. ఆ డేట్ మిస్సయితే 2024 సంక్రాంతి లేదా వేసవికి సినిమా రావచ్చు.