చావు కబురు చల్లగా చెప్పారు

అనుకున్నదే అయింది. సమంత నటించిన భారీ చిత్రం ‘శాకుంతలం’ మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే ఈ చిత్రం చాలా ఆలస్యమై.. వాయిదాల మీద వాయిదాలు పడ్డ సంగతి తెలిసిందే. అన్ని అడ్డంకులనూ అధిగమించి ఈ నెల 17న మహాశివరాత్రి వీకెండ్లో సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ దిశగా ప్రమోషన్లు కూడా చేశారు. కానీ ఉన్నట్లుండి టీం సైలెంట్ అయిపోయింది. సినిమా వాయిదా పడబోతున్నట్లు మీడియాలో వార్తలు మొదలయ్యాయి.

వాటి మీద ఏమీ స్పందించకుండా సైలెంటుగా ఉణ్నపుడే.. సినిమా 17న రావట్లేదని స్పష్టం అయిపోయింది. తర్వాత అందరూ ఈ సినిమా గురించి మాట్లాడ్డం మానేశారు. ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పింది ‘శాకుంతలం’ టీం. కొన్ని కారణాల వల్ల ముందు ప్రకటించినట్లు ఈ నెల 17న సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నామని.. కొత్త విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు.

ఈ రోజుల్లో సినిమాలు ఒక రిలీజ్‌ డేట్‌కు కట్టుబడి ఉండడం చాలా కష్టం అయిపోతోంది. కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రానికి నాలుగైదుసార్లు డేట్ మార్చడం తెలిసిందే. ఐతే అలాంటి సినిమాలు ఎన్నిసార్లు వాయిదా పడ్డా ప్రేక్షకుల్లో ఏమీ ఆసక్తి తగ్గదు. కానీ ‘శాకుంతలం’ లాంటి సినిమాలకు ఇలా డేట్లు మారుస్తూ పోవడం, మరీ లేటుగా రిలీజ్ చేయడం కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఈ సినిమా మీద నెమ్మదిగా ఆసక్తి సన్నగిల్లిపోతోంది. ఇలాంటి స్థితిలో మళ్లీ వాయిదా అంటే కష్టమే.

హిందీలో 17వ తేదీకి చాలినన్ని థియేటర్లు దక్కట్లేదన్న కారణంతోనే ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చెబుతున్నారు. కానీ పెద్దగా వసూళ్లు వచ్చే అవకాశం లేని హిందీ మార్కెట్ కోసం తెలుగులో క్రేజీ డేట్‌ను వదులుకోవడం కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శివరాత్రి వీకెండ్ తర్వాత రెండు మూడు వారాలు బాక్సాఫీస్ డల్లుగా మారే సూచనలున్న నేపథ్యంలో ఇక ‘శాకుంతలం’ వేసవి రిలీజ్‌కు ఫిక్సవబోతున్నట్లే.