విజయ్ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా ఊగిపోతుంది. మనదగ్గర ఒకప్పుడు పెద్ద హడావిడి ఉండేది కాదు కానీ తుపాకీతో మొదలుపెట్టి వారసుడు దాకా తన మార్కెట్ కాస్త చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగడంతో క్రమంగా బిజినెస్ స్కేల్ లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. తాజాగా అతను లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న కొత్త సినిమాకు లియో టైటిల్ ని ఫిక్స్ చేస్తూ బ్లడీ స్వీట్ ట్యాగ్ తో నిన్నో రెండున్నర నిమిషాలున్న ప్రీ టీజర్ ని రిలీజ్ చేశారు. మేకింగ్ గట్రా లోకేష్ స్టైల్ లోనే డిఫరెంట్ గా ఉన్నాయి కానీ దీని మీద సోషల్ మీడియాలో ఈసారి నెగటివిటీ గాలి గట్టిగానే వీస్తోంది.
దానికి మొదటి కారణం ఇదే లోకేష్ తీసిన విక్రమ్ కు లియోకు షాట్స్ పరంగా కాన్సెప్ట్ పరంగా దగ్గరి పోలికలు ఉండటం. బేకరీలో చాకోలెట్ సిరప్ లో కత్తిని ముంచి ప్రత్యర్థుల కోసం ఎదురు చూడటం అనే కాన్సెప్ట్ ని క్రియేటివ్ గా చూపించాడు లోకేష్. అయితే ఇది విక్రమ్ తో పాటు ఆ మధ్య వచ్చిన నాగార్జున ది ఘోస్ట్ టీజర్ కు దగ్గరగా ఉందని, సినిమాటిక్ యునివర్స్ పేరుతో లోకేష్ క్రమంగా ఒకే ఫార్ములా చుట్టూ రొటీన్ గా మారిపోతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటి సంగతి ఎలా ఉన్నా అభిమానులు మాత్రం మళ్ళీ తమ హీరో యాక్షన్ మోడ్ లోకి వచ్చేసినందుకు హ్యాపీగా ఫీలవుతున్నారు.
లియోకి సంబంధించి ఒక్కటి మాత్రం మెచ్చుకోవాలి. విడుదలని దీపావళికి ఫిక్స్ చేశారు. ఇంత భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీకి ఇలా పక్కా ప్రణాళికతో రిలీజ్ డేట్ లాక్ చేయడం చాలా అరుదు. అందులోనూ రెమ్యునరేషనే వంద కోట్లు తీసుకునే విజయ్ లాంటి స్టార్ హీరోకి. వరసగా సినిమాలు చేయడంలో ఇతని ప్లానింగ్ నిజంగా అభినందనీయం. మనదగ్గరేమో ఏడాదికి ఒకటి చేయడమే కష్టంగా మారిపోయి ఆ గ్యాప్ ని రెండేళ్ల నుంచి నాలుగేళ్ల దాకా పొడిగించుకుంటూ వెళ్తున్నారు. విజయ్ తరహా ప్లానింగ్ అమలుపరిస్తే టాలీవుడ్లోనూ స్టార్ హీరోలు స్పీడ్ పెంచొచ్చు. ఫ్యాన్స్ కే కాదు పరిశ్రమకూ మంచిది.