‘శాకుంతలం’ టీం చేస్తోంది కరెక్టేనా?

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది ‘శాకుంతలం’ సినిమా. షూటింగ్ పూర్తయిన ఏడాది తర్వాత కూడా ఈ చిత్రం విడుదలకు నోచుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇలాంటి పీరియడ్ సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ ఎంత శ్రమతో కూడుకున్న విషయం అయినప్పటికీ మరీ ఇంత ఆలస్యం జరగడం సమంత అభిమానులకు రుచించలేదు. ఎలాగైతేనేం సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. కొన్నిసార్లు డేట్ మారినా చివరికి ఫిబ్రవరి 17కు ఫిక్స్ చేసి ఆ దిశగా ప్రమోషన్లు కూడా చేయడంతో నిరీక్షణకు తెరపడబోతోందని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే మరోసారి ‘శాకుంతలం’ వాయిదా అని జోరుగా ప్రచారం జరుగుతోంది.

చిత్ర బృందం కూడా ఈ ప్రచారాన్ని ఖండించడం లేదు. దీంతో సినిమా మరోసారి వాయిదా పడడం ఖాయమే అనిపిస్తోంది. ఐతే ఈ వాయిదాకు కారణమేంటన్నదానిపై జరుగుతున్న చర్చ చూస్తుంటే ‘శాకుంతలం’ టీం తప్పులో కాలేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఫిబ్రవరి 17నే వస్తే హిందీలో సరైన రిలీజ్ దక్కదన్న ఉద్దేశంతోనే ‘శాకుంతలం’ను వాయిదా వేస్తున్నట్లు చెబుతున్నారు. ‘పఠాన్’ జోరు చూసి 10న రావాల్సిన ‘షెజాదా’ను 17కు మార్చడంతో ‘శాకుంతలం’కు ఉత్తరాదిన థియేటర్ల సమస్య తలెత్తి వాయిదాకు నిర్ణయించుకున్నారట. ఐతే ‘శాకుంతలం’కు ప్రస్తుతం హిందీలో ఎలాంటి బజ్ లేదు. అందులో ఏ బాలీవుడ్ ఆర్టిస్టూ నటించలేదు. సమంతకు హిందీలో పెద్ద ఫాలోయింగ్ కూడా లేదు. హీరోయిజం, మాస్ టచ్ ఉన్న సినిమాలైతే ఉత్తరాదిన అనుకోకుండా అద్భుతాలు చేసేస్తాయని ఆశించవచ్చు. కానీ ‘శాకుంతలం’ విషయంలో అలా జరిగే అవకాశాలు కనిపించడం లేదు.

హిందీలో పెద్దగా ఆశల్లేని మార్కెట్ గురించి ఆలోచించి.. మహా శివరాత్రికి మంచి డేట్ దొరికితే సమంతకు మంచి ఫాలోయింగ్ ఉన్న సౌత్‌లో సినిమాను రిలీజ్ చేయకుండా వదిలేయడం అన్నది ఎంత వరకు కరెక్ట్ అన్నది ప్రశ్న. ఈ డేట్ మిస్సయితే వేసవి వరకు వచ్చేది అన్ సీజన్. ఆ టైంలో రిలీజ్ చేస్తే దక్షిణాదిన కూడా సరైన వసూళ్లు రాకపోవచ్చు. వేసవి కోసం ఎదురు చూస్తే బాగా ఆలస్యం అయిపోతుంది, పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ‘శాకుంతలం’ వాయిదా విషయంలో ఇంకోసారి ఆలోచించుకుంటే బెటర్.