OG గురించి అభిమానుల గొడవ

టైం దొరికితే చాలు ట్విట్టరే ప్రపంచంగా బ్రతికే యువత లక్షల్లో ఉన్నారు. అలా అని ఏదో పనికొచ్చేది చేస్తారనో వెతుకుతారనో కాదు. తమ అభిమాన హీరోల గొప్పలు చెప్పుకోవడం గురించి, కలెక్షన్ రికార్డులను ప్రకటించుకోవడం గురించి ఇలా వాళ్లకు ఉపయోగపడేది మచ్చుకు కూడా ఉండదు. ఇప్పుడు కొత్తగా OG టాపిక్ మీద గొడవపడుతున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ సుజిత్ ల కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలైన సంగతి తెలిసిందే. టైటిల్ పెట్టలేదు కానీ దే కాల్ హిం ఓజి అనే క్యాప్షన్ బాగా వైరల్ అయ్యింది. దానికి ఇచ్చిన అర్థం ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయింది.

ఈ బ్యాక్ డ్రాప్ లో గతంలో పంజా, బాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఒరిజినల్ అనే పదాన్ని నొక్కి చెప్పడంతో ఇంతకు ముందు అసలైన డాన్లు లేరనే రీతిలో కొందరు అత్యుత్సాహంతో వేరే అర్థం తీశారు. ఎవరో అయితే ఏమో అనుకోవచ్చు. రామ్ చరణే ఓజి అంటూ మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ట్వీట్లు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో బాబాయ్ అబ్బాయ్ లలో ఎవరు గొప్ప ఎవరు తక్కువనే దాని మీద అర్థం లేని డిబేట్లు స్టార్టయ్యాయి. ఇవి చాలవు అన్నట్టు మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ ఫాలోయర్స్ ఇలా ఎవరికి వారు తామే ఓజిలంటూ ఓవరాక్షన్ చేసేశారు.

ఇది చాలా దూరం వెళ్లిపోయింది. అసలు గ్యాంగ్ స్టర్ కాన్సెప్టే ఇప్పటిది కాదు. ఎప్పుడో అమితాబ్ బచ్చన్ డాన్ తో మొదలుపెట్టి దాని రీమేక్ యుగంధర్ లో ఎన్టీఆర్, అగ్ని పర్వతంలో కృష్ణ, బిగ్ బాస్ లో చిరంజీవి, యువరత్న రాణాలో బాలకృష్ణ ఇలా ఒకరేమిటి ఈ పాత్రలో కనిపించని కొత్త పాత హీరో ఎవరూ లేరు. కాబట్టి అందరూ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్సే. కాలాన్ని బట్టి ఆ సీజన్ లో కొట్టిన హిట్టుని బట్టి ఎవరికి వారు మారతారు తప్పించి శాశ్వతంగా ఒకరే ఉండటం జరగదు. ఇది మర్చిపోయి దీన్ని ఇంత రాద్ధాంతం చేయడమే కామెడీ. పవన్ ఓజి రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది.