రవితేజ చిన్న హీరో ఎలా అవుతాడు

నిన్న సాయంత్రం వరంగల్ లో జరిగిన వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో చిరంజీవి మరోసారి స్లిప్ అయ్యారు. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా దాని అర్థం ఇంకోలా వెళ్లిపోవడంతో మాస్ మహారాజా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వాల్ పోస్టర్ సీన్ లో రవితేజ ఫోటోని తన పంచెతో తుడవడాన్ని చిరు ప్రస్తావిస్తూ అతన్ని చిన్న హీరో అని సంబోధించడం ఈ రచ్చకు కారణం అయ్యింది. నిజానికి చిరు అన్నది వయసు ఉద్దేశంలో కావొచ్చు లేదా మార్కెట్ కోణంలో అవొచ్చు. కానీ సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఏదో ఫ్లోలో అనేసుకుంటూ వెళ్లారు తప్ప నిర్దిష్టంగా చెప్పలేదు

గతంలో ప్రెస్ మీట్ జరిగినప్పుడూ ఇదే తరహాలో రవితేజని మర్చిపోయి ఆ తర్వాత ట్విట్టర్ లో సారీ నోట్ పెట్టిన మెగాస్టార్ ఇప్పుడు అంత కంటే పెద్ద పొరపాటే చేశారు. ఎందుకంటే ఏ యాంగిల్ లోనూ తనని చిన్న హీరోగా పరిగణించలేం. రాజ్ తరుణ్, సందీప్ కిషన్, సుధీర్ బాబు లాంటి తక్కువ మార్కెట్ ఉన్న వాళ్ళకు ఆ పోలిక కరెక్ట్ కానీ ధమాకా, క్రాక్ లాంటి రెగ్యులర్ సబ్జెక్టులతోనూ వంద కోట్ల గ్రాస్ సాధిస్తున్న మాస్ రాజా కాదు. వరస ఫ్లాపులు వచ్చినప్పుడు కేవలం ఒక్క బ్లాక్ బస్టర్ తో తన కంబ్యాక్ ని వెనక్కు తెచ్చుకోవడం అందరి వల్ల అయ్యేది కాదు. టాప్ లీగ్ లో ఉన్నది ఆ కారణంగానే.

రామ్ చరణ్, తారక్, బన్నీలాగా టైర్ వన్ రేంజ్ రాకపోయినా రవితేజ మార్కెట్ సరైన హిట్ పడితే యాభై కోట్ల షేర్ కు పైగానే ఉంది. అలాంటప్పుడు ఉపమానాలు సరిగ్గా వాడాలి. యథాలాపంగా అన్నా సరే ఇది మాత్రం మాస్ రాజా అభిమానులకు నచ్చలేదు. ఇదే ప్రసంగంలో రవితేజ తనకు పవన్ కళ్యాణ్ తో సమానమని చిరంజీవి అన్నారు కానీ దాని కన్నా ఇప్పుడీ చిన్న హీరో టాపిక్కే మెయిన్ హై లైట్ గా మారిపోయింది. దీనికి మరి వివరణ వస్తుందో లేక లైట్ తీసుకుంటారో చూడాలి. నూటా పాతిక కోట్ల షేర్ దాటేసిన వాల్తేరు వీరయ్యకి ఇంకో వారం రోజులు మంచి రన్ కు అవకాశం ఉంది