స్టార్ క్యాస్టింగ్ లేకుండా జనాన్ని మెప్పించాలంటే మంచి కంటెంట్ తప్ప మరో మార్గం లేదు. అందులోనూ థియేటర్లకు రావడంలో ప్రేక్షకులు చాలా సెలెక్టివ్ గా ఉన్న ట్రెండ్ లో ఖచ్చితంగా కథలో వైవిధ్యం ఉండాల్సిందే. బుట్టబొమ్మ ఆ క్యాటగిరీలోనే కనిపిస్తోంది. విశ్వాసంలో అజిత్ కూతురిగా, ది ఘోస్ట్ లో నాగార్జున మరదలిగా మనకూ పరిచయమున్న అనీఖా సురేంద్రన్ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా బుట్ట బొమ్మ. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నారు.
అరకు దగ్గరుండే చిన్న గ్రామంలో ఉండే అమ్మాయి(అనీఖా సురేంద్రన్)కు ఓ మంచి కుర్రాడి(సూర్య వశిష్ఠ)తో స్నేహం ప్రేమ దాకా వెళ్తుంది. కానీ ఇద్దరూ ఫోన్ లోనే ఉంటారు. ప్రత్యక్షంగా కలుసుకోరు. ఇంట్లో తండ్రి కట్టుబాటు ఎంత ఉన్నా కోరుకున్న చెలిమిని వదిలి ఉండలేని పరిస్థితి నెలకొంటుంది. అంతా సవ్యంగా ఉందనుకుంటున్న టైంలో రౌడీ లాంటి యువకుడు(అర్జున్ దాస్)వీళ్ళ జీవితంలోకి వస్తాడు. అక్కడి నుంచి ప్రమాదాలు భయాలు మొదలవుతాయి. ఈ జంట వెంటే పడతాడు. దీంతో ఈ వలయం నుంచి ఎలా బయటపడ్డారనేదే మెయిన్ పాయింట్
కాన్సెప్ట్ ఆసక్తికరంగానే ఉంది. అనీఖా మంచి లుక్స్ తో ఆకట్టుకునేలా ఉంది. హీరో విలన్ ఇద్దరి మొహాలు టాలీవుడ్ జనాలకు అంతగా పరిచయం లేనివి కావడంతో భారమంతా దర్శకుడి మీదే పడింది. మలయాళం హిట్ మూవీ కప్పేలా రీమేక్ గా రూపొందిన బుట్టబొమ్మకు గోపి సుందర్ స్వరాలు సమకూర్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సింపుల్ విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అసలే ఒకరోజు ముందు రిలీజవుతున్న సందీప్ కిషన్ మైఖేల్, సుహాస్ రైటర్ పద్మభూషణ్ లతో పోటీ పడుతున్న బుట్టబొమ్మ మరి ఒరిజినల్ వెర్షన్ ని తలపించేలా ఆడియన్స్ ని మెప్పిస్తుందో లేదో చూడాలి