సినిమా మీద ఎంత నమ్మకం ఉన్నా కథలో అవకాశం ఉంటే తప్ప సీక్వెల్ కి వెళ్ళకూడదు. అది కూడా స్టార్ హీరోలకు మాత్రమే వర్కౌట్ అవుతుంది తప్ప లేనిపోని రిస్కులు చేస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. నాని నటిస్తున్న ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ దసరా మార్చి 30న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎలా పుట్టిందో కానీ ఇది రెండు భాగాలుగా వస్తున్న వార్త సోషల్ మీడియాని కమ్మేయడంతో అది కాస్తా వైరల్ అయిపోయింది. ఆఖరికి నాని స్వయంగా రంగంలోకి దిగి అబ్బే అదేం లేదని ఒకే భాగంలో డబుల్ పవర్ అంతకన్నా ఎక్కువే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు.
దసరా ఎంత బాగా వచ్చినా నాని టీమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే పుష్ప ఫార్ములా దీనికి పని చేయదు. అల్లు అర్జున్ రేంజ్ వేరు కాబట్టి దాని కోసం ఏకంగా మూడేళ్ళ దాకా ఖర్చు పెట్టాల్సి వచ్చినా వెనక్కు తగ్గలేదు. ఆఖరికి హెయిర్ స్టైల్ మార్చకుండా మరీ దీని కోసమే కష్టపడుతున్నాడు. స్క్రిప్ట్ కోసమే సంవత్సరం పట్టిందంటేనే హోమ్ వర్క్ ఏ రేంజ్ లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కానీ నానికి అలా కుదరదు. ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు చేస్తేనే హిట్లు ఫ్లాపులతో తన మార్కెట్ బ్యాలన్స్ అవుతూ వర్క్ అవుట్ చేసుకోవచ్చు.
అలా కాకుండా ఏదో పర్సనల్ గా నచ్చేసిందని దసరాకూ రెండు భాగాలు పెట్టుకుంటే బోలెడు టైంతో పాటు బడ్జెట్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఊర మాస్ గెటప్ లో న్యాచురల్ స్టార్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతం మీద భారీ అంచనాలున్నాయి. అంటే సుందరానికి ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో నాని పూర్తిగా ట్రాక్ మార్చుకుని మాస్ వైపు వచ్చేశాడు. ఇది ఎలాంటి ఫలితం ఇవ్వనుందో ఇంకో రెండు నెలల్లో తేలిపోతుంది. వచ్చే నెల నుంచి ప్రమోషన్లు మొదలైపోతాయి.