‘పఠాన్’ సినిమా గురించి దాదాపు రెండు నెలలుగా నడుస్తున్న వివాదాలు, చర్చల గురించి తెలిసిందే. సిల్లీ కారణాలు చూపించి ఈ సినిమా మీద ఒక వర్గం అదే పనిగా విష ప్రచారం చేసింది. అది ఒక దశలో శ్రుతి మించడంతో జనాలకు ఒళ్లు మండేలా చేసింది. దీంతో ఈ ‘బాయ్‌కాట్’ బ్యాచ్‌కు బుద్ధి చెప్పాలి అన్నట్లుగా జనాలు ‘పఠాన్’ చూసేందుకు క్యూలు కట్టేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరిగాయి. తొలి రోజు కూడా దేశవ్యాప్తంగా థియేటర్లు జనాలతో కళకళలాడిపోయాయి. దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అయింది. రికార్డులు తలవంచాయి.
ఇండియాలో తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘పఠాన్’ రికార్డు నెలకొల్పింది. ఐతే బాయ్‌కాట్ బ్యాచ్ ఇప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు.. సినిమాలో చిన్న చిన్న విషయాలు పట్టుకుని వివాదాలు రాజేయడానికి ప్రయత్నిస్తున్నారు. నెగెటివిటీని స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు.
ఈ బ్యాచ్ అతి ఇలా ఉంటే.. ఇంకోవైపు ఈ సినిమాకు బాలీవుడ్ క్రిటిక్స్, ట్రేడ్ పండిట్లు ఇస్తున్న ఎలివేషన్ల అతి కూడా మామూలుగా లేదు. నిజానికి ‘పఠాన్’ ఒక సగటు కమర్షియల్ ఎంటర్టైనర్. ఫ్యాన్స్, యాక్షన్ ప్రియులను ఆ సినిమా అలరిస్తున్న మాట వాస్తవం. కానీ కథాకథనాల పరంగా చూసుకుంటే సినిమా వీకే. ఇదొక క్వాలిటీ సినిమా అని చెప్పలేని పరిస్థితి. కానీ బాలీవుడ్ క్రిటిక్స్ ఇలాంటి సినిమా ఇంత వరకు రాలేదన్నట్లుగా దీనికి ఎలివేషన్లు ఇస్తున్నారు.
ప్రముఖ క్రిటిక్స్ అందరూ కూడా ఈ చిత్రానికి 4, 4.5 రేటింగ్స్ ఇచ్చేయడం గమనార్హం. అంతంత రేటింగ్స్ ఇచ్చేంత విషయం అయితే సినిమాలో లేదు. సినిమాలో ఉన్నదంతా ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు మాత్రమే. ఇలాంటివి మన సౌత్ సినిమాల్లో బోలెడు చూశాం.ఇది జస్ట్ ఒక టైంపాస్ ఎంటర్టైనర్ మాత్రమే. అలాంటి సినిమాకు ఓవర్ ఎలివేషన్లు, రేటింగ్స్ ఇస్తూ దాన్ని పుష్ చేయడానికి బాలీవుడ్ క్రిటిక్స్, ట్రేడ్ పండిట్లు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. బాయ్‌కాట్ బ్యాచ్ సినిమాకు వ్యతిరేకంగా చేస్తున్నఅది అతి అయితే.. సినిమాను లేపడానికి వీళ్లు చేస్తున్నది కూడా అతి అనే చెప్పాలి.