బాలయ్య మీద తమన్ ప్రేమ

సంక్రాంతికి రెండు హిట్లతో మంచి జోష్ మీదున్న తమన్ వీరసింహారెడ్డికి ఇచ్చిన సంగీతం మంచి పేరే తెచ్చింది. అఖండని మించి అని చెప్పలేకపోయినా పెద్ద క్యారెక్టర్ కి సెట్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో అభిమానులకు మంచి గూస్ బంప్స్ ఇచ్చింది. నిన్న జరిగిన ఈ సినిమా విజయోత్సవంలో తమన్ బాలయ్య మీద తనకెంత ప్రేమ ఉందో చాలా బలంగా వ్యక్తపరిచాడు. తన జీవితానికి శివుడు అంటే బాలకృషేనని, అఖండ బీజీఎమ్ కోసం పని చేస్తున్నప్పుడు కనీసం ఆమ్లెట్ కూడా తీసుకోలేదని, అంత నిష్టగా ఉంటూ రోజు లింగ పూజ చేసేవాడినని చెప్పుకొచ్చాడు. ఇది ఇంతకు ముందు పంచుకోని ముచ్చట.

వృత్తి పట్ల డెడికేషన్ కి ఉదాహరణగా తమన్ ఫ్యాన్స్ దీని గురించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గతంలో దక్ష యజ్ఞంలో నటిస్తున్నప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ ఇలాగే నియమ నిష్టలతో ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. ఇళయరాజా ఏదైనా దైవ భక్తికి సంబంధించిన ఆల్బమ్ కంపోజ్ చేసేటప్పుడు ఆహారం పద్దతుల విషయంలో రాజీ పడరు. మళ్ళీ ఆ స్థాయి కమిట్ మెంట్ తమన్ చూపించాడనే విషయం నిన్న బయట పడింది. ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నా తమన్ కు బాలయ్య మూవీ ఆఫర్ వచ్చింది అఖండతోనే. మొదటి కలయికే బ్లాక్ బస్టర్ ఇచ్చింది.

ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ఈ కాంబో పని చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న కామెడీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం తమన్ మూడోసారి ఆల్బమ్ రెడీ చేస్తున్నారు. గతంలో కోటి, మణిశర్మ, కీరవాణి లాంటి అతి కొందరికి మాత్రమే బాలయ్యకు వరసగా మూడు నాలుగు సినిమాలు చేసే అవకాశం దక్కింది. ఇప్పుడు తమన్ బాగా సింక్ అయిపోవడంతో దర్శకుడు ఎవరైనా సరే మ్యూజిక్ దగ్గరికి వచ్చేటప్పటికీ ఓన్లీ ఆప్షన్ తమనే నిలుస్తున్నాడు. వారసుడు విషయంలో తమన్ ఇంతే ఎగ్జైట్ మెంట్ చూపించడం దాని ప్రమోషన్లలో చూడటం తెలిసిందే.