బాలయ్యనూ వదలని హరీష్

స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడే టాలీవుడ్ దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు. చక్కటి పదాలు వాడుతూ.. ఆసక్తికర విషయాలు చెబుతూ.. హీరోల ఫ్యాన్సే కాకుండా అందరూ కనెక్టయ్యేలా ప్రసంగాలు చేయడం హరీష్‌కే చెల్లు. ఐతే హరీష్ ఏ సినిమా వేడుకకు వచ్చినా.. అక్కడున్న హీరోతో సినిమా చేయాలనుందని.. ఆ ప్రయత్నం చేస్తున్నానని అనడం మామూలే.

ఇలా గతంలో చాలామంది హీరోలకు చెప్పిన హరీష్.. ఇప్పుడు నందమూరి బాలకృష్ణను కూడా వదల్లేదు. హరీష్ శైలికి బాలయ్య స్టైల్‌కు చాలా వైరుధ్యం ఉన్నా సరే.. బాలయ్యతో సినిమా చేయాలని ఉందని, అందుకోసం చాలా సీరియస్‌గా ప్రయత్నిస్తున్నానని హరీష్ చెప్పడం విశేషం.

తన మిత్రుడైన గోపీచంద్ మలినేని బాలయ్యతో తీసిన ‘వీరసింహారెడ్డి’ ప్రారంభోత్సవం రోజు తాను అతిథిగా వచ్చి ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశానని.. అప్పుడే బాలయ్యతో ఫుల్ లెంగ్త్ సినిమా డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందని.. తాను సీరియస్‌గా బాలయ్య కోసం ఒక కథ రాసి మెప్పించే ప్రయత్నంలో ఉన్నానని.. తనకంటే కూడా మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలైన రవిశంకర్, నవీన్ ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారని.. త్వరలోనే తమ ప్రయత్నం నెరవేరుతుందని ఆశిస్తున్నానని హరీష్ తెలిపాడు.

ఐతే ఆడియో వేడుకల్లో రివాజుగా చెప్పే మాటలేనా ఇవి.. లేక నిజంగా హరీష్ బాలయ్యతో సినిమా చేస్తాడా అన్న చర్చ నడుస్తోంది. తన అభిమాన కథానాయకుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు తయారవగా.. దాన్ని పక్కనా పెట్టలేక, వేరే సినిమానూ చేయలేక హరీష్ కొన్నేళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. అందులో ఇరుక్కుపోయిన హరీష్ తాను ఖాళీ చేసుకుని, బాలయ్యకు ఖాళీ దొరికి నిజంగా ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలుస్తుందేమో చూడాలి.