సోలోగా వస్తున్నా టెన్షన్ తప్పడం లేదు

ఇంకో నాలుగు రోజుల్ సుధీర్ బాబు కొత్త సినిమా హంట్ విడుదల కాబోతోంది. పోటీగా అనుకున్న బుట్టబొమ్మ ఫిబ్రవరి 4కి వాయిదా పడటంతో ఇది సోలోగా నిలిచిపోయింది. అలా అని పూర్తిగా ఆనందించడానికి లేదు. ఎందుకంటే ఒకరోజు ముందు వస్తున్న షారుఖ్ ఖాన్ పఠాన్ దూకుడు అనుకున్న దానికంటే చాలా పెద్ద స్థాయిలో ఉంది. ఉదాహరణకు హైదరాబాద్ లో దీనికి కనివిని ఎరుగని రీతిలో షోలు వేస్తున్నారు. మొదటి రోజు దాదాపుగా అన్నీ అడ్వాన్స్ ఫుల్ అయ్యే పరిస్థితి నెలకొంది. బాగుందని టాక్ వస్తే కనీసం ఒక వారం పాటు బాద్షా చేసే బాక్సాఫీస్ ఊచకోత మాములుగా ఉండదు.

హంట్ కి టెన్షన్ కలిగిస్తోంది ఇదే. అసలే యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీశారు. బిసి సెంటర్స్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం అంత సులభం కాదు. పైగా ఫుల్ జోష్ మీదున్న వాల్తేరు వీరయ్య సాధారణ రేట్లకు టికెట్ల అమ్మకం సోమవారం నుంచి అందుబాటులోకి వస్తుంది. వీరసింహారెడ్డి, వారసుడు ఇదే రూటు పడతాయి. మొదటి పది రోజులు వీటిని మిస్ అయిన కామన్ ఆడియన్స్ థియేటర్లకు వస్తారని ట్రేడ్ ఎదురు చూస్తోంది. పైగా వీటిలో చాలా మటుకు మూడు వారాల అగ్రిమెంట్లు చేసుకున్నవి ఉన్నాయి. సో మాస్ ని తనవైపు లాగడం అనేదే సుధీర్ బాబు ముందున్న అతి పెద్ద టాస్క్.

అసలే రెండు డిజాస్టర్లు వరసగా దెబ్బ కొట్టాయి. క్లాసిక్ లా ఫీలైన శ్రీదేవి సోడా సెంటర్ ఓటిటిలో ఆడింది కానీ బిజినెస్ పరంగా ఓడింది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలికి ఎంత సాఫ్ట్ కార్నర్ ఉన్నా జనం ఆదరించలేకపోయారు. ఆర్టిస్టుగా ఏ లోపం లేకుండా కష్టపడుతున్న సుధీర్ బాబుకి మళ్ళీ సమ్మోహనం లాంటి బ్రేక్ దక్కాలి. తను మాత్రం వి నుంచి ఎక్కువగా యాక్షన్ జానర్ నే ఇష్టపడుతున్నాడు. ఇప్పుడీ హంట్ తర్వాత చేస్తున్న మామ మస్చీన్ద్ర, హరోం హర కూడా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్నవే. పఠాన్ తో పాటు చుట్టూ ఉన్న సవాళ్లను సుధీర్ బాబు ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి.