గర్వపడాల్సిన టైంలో అక్కర్లేని ఫ్యాన్ వార్

ఇవాళ సోషల్ మీడియా మొత్తం రాజమౌళి జేమ్స్ క్యామరూన్ సంభాషణ తాలూకు వీడియోతో హోరెత్తిపోతోంది. ప్రపంచం మొత్తం గర్వపడే మాస్టర్ పీస్ అవతార్ తీసిన దర్శకుడే జక్కన్నను అంతగా మెచ్చుకుంటే చూసేందుకు రెండు కళ్ళు చాలలేదంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. రెండుసార్లు ఆర్ఆర్ఆర్ చూసిన ఆయన అందులో సున్నితమైన అంశాల గురించి మాట్లాడిన తీరు అబ్బురపరిచింది. మాములుగా ఇండియన్ మూవీస్ అంటేనే అదోమాదిరిగా చూసే వెస్టర్న్ మేకర్స్ కు భిన్నంగా ఆ దిగ్గజం స్పందించిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడిది ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది.

ఈ లెక్కన ఆస్కార్ రావడం పెద్ద కష్టంగా అనిపించడం లేదు. ఒకవేళ రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే రాజమౌళి తన మొదటి సినిమా తీయడానికి ముందే టైటానిక్ ద్వారా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించిన విఖ్యాత దర్శకుడి చేత మెప్పు పొందటం ముందు ఏ అవార్డు అయినా తక్కువే. పైగా జక్కన్న ఆరాధించే వాళ్ళలో క్యామరూన్ దే మొదటి స్థానం. ఇదంతా బాగానే ఉంది కానీ తారక్ చరణ్ ఫ్యాన్స్ మధ ఇదో కొత్త వార్ కి దారి తీసింది. క్యామరూన్ కొన్ని సన్నివేశాలు ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పిన మాటలను పట్టుకుని అది తమ హీరోని ప్రత్యేకంగా పొగిడారని ఒకరినొకరు ట్రోలింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు.

నిజానికి జేమ్స్ క్యామరూన్ కాంప్లిమెంట్స్ ఇచ్చింది ఫిలిం మేకింగ్ గురించి తప్ప యాక్టర్స్ గురించి కాదు. ఉదాహరణగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఇంట్రో సీన్ ప్రస్తావన తెచ్చారు తప్పించి ప్రత్యేకంగా ఫలానా హీరోని పొగడాలనే ఆలోచన ఎంత మాత్రం లేదు. పరిణితి కన్నా హడావిడి ఎక్కువ చేసే అభిమానులు అంత లోతుగా అర్థం చేసుకోలేదు. దీంతో పరస్పరం కవ్వించుకోవడం మొదలుపెట్టారు. వీటి సంగతి ఎలా ఉన్నా లెజెండరీ డైరెక్టర్లు హీరోలు సైతం ఈర్ష్య పడేలా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జక్కన్న రోజూ దిష్టి తీయించుకోవాల్సి ఉంటుంది. ఆస్కార్ వస్తే ఇంకెంత రచ్చో చూడాలి.