ఇంకో ఏడాదిన్నర కంటే తక్కువ టైంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వీలైనంత వేగంగా సినిమాలు పూర్తి చేయాల్సిన బాధ్యత తలపై ఉంది. ఎంతలేదన్నా రాబోయే సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయి పార్టీ కార్యకలాపాలతో పాటు ప్రచార కార్యక్రమాలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. దానికి ఎంత డబ్బు అవసరమవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పొత్తులు ఇతరత్రా వ్యవహారాలు తర్వాత తేలుతాయి కానీ ముందైతే జనసేనకు కావాల్సిన ఆర్ధిక బలాన్ని పటిష్టం చేసుకోవడం చాలా అవసరం. అందుకే రీమేకా స్ట్రెయిటా అని ఆలోచించకుండా షూటింగులకు ఓకే చెప్పేస్తున్నాడు.
గత ఏడాది నుంచే వార్తల్లో ఉన్న వినోదయ సితం రీమేక్ ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లనుంది. జనవరి 27 నుంచి రెగ్యులర్ షూట్ మొదలుపెడతారని సమాచారం. ఒరిజినల్ వెర్షన్ లో తంబి రామయ్య చేసిన పాత్రను సాయి ధరమ్ తేజ్ ఇమేజ్ వయసుకు తగ్గట్టు త్రివిక్రమ్ కీలక మార్పులు చేసి స్క్రిప్ట్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ లా దీనికీ ఆయన కలం అందించబోతున్నారు. అధికారికంగా ఓపెనింగ్ రోజే ప్రకటిస్తారు. ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన సముతిరఖనినే దీనికి దర్శకత్వం వహించబోతున్నారు. అక్కడ ఆయన చేసిన క్యారెక్టర్ లోనే పవన్ కనిపించబోయేది.
మరోవైపు హరిహరవీరమల్లు చివరి స్టేజిలో ఉంది. వేసవి విడుదలను లక్ష్యంగా చేసుకుని నిర్మాత ఏఎం రత్నం దర్శకుడు క్రిష్ పరుగులు పెడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్స్ హరీష్ శంకర్ ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టుకున్నారు. వినోదయ సితంకు కేవలం ఇరవై రోజుల వర్కింగ్ డేస్ సరిపోవడంతో ఆ మేరకు పక్కాగా పూర్తి చేస్తారు. ఫ్యాన్స్, సన్నిహితులు రీమేకులు వద్దని ఎంతగా చెప్పినా పవన్ మాత్రం వినడం లేదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లు వరసగా చేశాక తక్కువ గ్యాప్ లో చేస్తున్న మరో పునఃనిర్మాణం ఇది. హీరోయిన్, ఆమెతో డ్యూయెట్లు ఇందులో ఉండవని ఇన్ సైడ్ టాక్.
Gulte Telugu Telugu Political and Movie News Updates