నందమూరి బాలకృష్ణ సంక్రాంతి రోజు క్షమాపణ లేఖను మీడియాకు రిలీజ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన దేవ బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పారు. బాలయ్య కొత్త చిత్రం ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలయ్య మాట్లాడుతూ.. దేవబ్రాహ్మణులకు గురువు దేవళ మహర్షి అని.. వారి నాయకుడు రావణాసురుడు అని వ్యాఖ్యానించారు.
కానీ బాలయ్య చరిత్రను పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడారని.. ఆయన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని.. తన వ్యాఖ్యలకు బాలయ్య క్షమాపణలు చెప్పాలని దేవ బ్రాహ్మణుల సంఘం డిమాండ్ చేసింది. వివాదానికి తెరదించుతూ బాలయ్య క్షమాపణ లేఖ రిలీజ్ చేశారు.
‘‘దేవ బ్రాహ్మణ సోదర సోదరీమణులకు మీ సోదరుడు నందమూరి బాలకృష్ణ మన:పూర్వక మనవి. దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణ బ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పని తెలియజేసిన దేవ బ్రాహ్మణ పెద్దలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధ పడ్డాను. నాకు ఎవరినీ బాధ పెటట్ాలన్న ఆలోచన లేదు, ఉండదని తెలుగు ప్రజలందరికీ తెలుసు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే. అంతేకానీ సాటి సోదరుల మనసు గాయపరచడం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి. పైగా దేవాంగులలో కూడా నా అభిమానులు చాలామంది ఉన్నారు. నా వాళ్లను నేను బాధ పెట్టుకుంటానా? అర్థం చేసుకుని పొరబాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను’’ అని బాలయ్య పేర్కొన్నాడు.