అతి విశ్వాసం.. కొంప ముంచింది

ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరిసింహారెడ్డి’ లాంటి భారీ చిత్రాలకు తోడు.. వారసుడు, తెగింపు లాంటి రెండు అనువాద చిత్రాలు చాలా ముందుగానే షెడ్యూల్ అయిపోయాయి. వాటికే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టంగా ఉంటే.. ‘కళ్యాణం కమనీయం’ అనే చిన్న సినిమా కూడా సంక్రాంతి రేసులోకి వచ్చింది. థియేటర్లు అందుబాటులో లేవు.

పైగా ఇదేమో చిన్న సినిమా, దానికి బజ్ కూడా లేదు. ఇంత పోటీ మధ్య ఈ చిన్న చిత్రాన్ని రిలీజ్ చేయడం అవసరమా అన్న చర్చ జరిగింది. కానీ యువి క్రియేషన్స్ వాళ్లు చాలా కాన్ఫిడెంట్‌గా రంగంలోకి దిగేశారు.

2017లో ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాలకు పోటీగా ‘శతమానం భవతి’ రిలీజై సూపర్ హిట్టయినట్లే ఇది కూడా ఆడేస్తుందని అనుకున్నారేమో తెలియదు. కానీ యువి వాళ్లది ఆత్మవిశ్వాసం కాదు.. అతి విశ్వాసం అని తెర మీద బొమ్మ పడ్డాక కానీ అర్థం కాలేదు.

‘కళ్యాణం కమనీయం’ చాలా సాధారణమైన సినిమా. షార్ట్ ఫిలింని కొంచెం పొడిగించినట్లు ఉందే తప్ప.. దీన్ని ఫీచర్ ఫిలింగా తీసేంత విషయం లేదు. ఆరంభం నుంచి ఒకే గ్రాఫ్ మెయింటైన్ చేస్తూ.. ఎక్కడా పైకి లేవకుండానే ముగిసిపోయింది.

అసలు ఏ ధైర్యంతో ఈ కాన్సెప్ట్‌ను సినిమాగా తీశారు.. ఇంకే ధైర్యంతో సంక్రాంతిలో భారీ చిత్రాల మధ్య పోటీకి నిలిపారు అన్నది అర్థం కావడం లేదు. పరిమిత సంఖ్యలో అయినా సరే.. ఈ సినిమా కోసం కేటాయించిన థియేటర్లు వృథా అయిపోయాయి.

‘వారసుడు’ కోసం దిల్ రాజు చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లు తీసేసుకోగా.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు సరిపడా థియేటర్లు లేక, టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతుంటే.. ‘కళ్యాణం కమనీయం’ జనాల్లేక ఖాళీగా వెలవెలబోతోంది. యువి వాళ్లు చేసింది ఎంత పెద్ద తప్పో చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలి?