చిరు పంచ్.. మళ్లీ కొరటాలకేనా?

మెగాస్టార్ చిరంజీవిని ‘ఆచార్య’ ఫలితం బాగానే డిస్టర్బ్ చేసినట్లు అనిపిస్తోంది. ప్రతి హీరోకూ ఇలాంటి డిజాస్టర్లు కామనే కానీ.. ఏదో తప్పు జరిగిందిలే అనుకుని ముందుకు సాగిపోవాలి. ఫెయిల్యూర్‌కు ఏ ఒక్కరినో నిందించడం కూడా కరెక్ట్ కాదు.

కానీ చిరు మాత్రం ‘ఆచార్య’ ఫెయిల్యూర్‌కు బాధ్యత కొరటాల శివదే అన్నట్లుగా తరచుగా ఆయన్ని ఉద్దేశించి పరోక్షంగా ఏదో ఒక మాట అంటుండడం చాలామందికి రుచించడం లేదు. ఈ విషయంలో చిరు ఇప్పటికే చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా సరే ఆయన ఆలోచన మారినట్లు లేదు. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ చిరు చేసిన వ్యాఖ్యలు కొరటాలను ఉద్దేశించే అన్న చర్చ నడుస్తోంది. 

‘‘చాలామంది హర్టవుతారేమో డైరెక్టర్లు యంగ్ లేదా సీనియర్లు ఎవరైనా సరే చెబుతున్నానండీ. సినిమా అన్నది డైరెక్టర్ సూపర్ హిట్ ఇవ్వడం కాదు. అద్భుతమైన కథ ఇవ్వడం కాదు. అన్నీ ఓకే అనుకున్న తర్వాత నిర్మాతలకు సినిమాను ఆన్ టైం పూర్తి చేసి ఇవ్వడం అన్నది, బడ్జెట్ లోపు తీయడం అన్నది మీ మొదటి సక్సెస్ అనుకోవాలి. నిర్మాతలు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది.

‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో నిర్మాతలకి నయా పైసా కూడా వృథా కాలేదు’’ అని చిరు ఈ వేడుకలో వ్యాఖ్యానించారు. ఎక్కడా కొరటాల పేరు ఎత్తకపోయినా.. ఈ పంచ్ ఆయన్నుద్దేశించే అనే చర్చ నడుస్తోంది. ‘ఆచార్య’ షూటింగ్ విపరీతంగా ఆలస్యం కావడం.. దాని వల్ల బడ్జెట్ అసాధారణంగా పెరిగిపోవడం సినిమాకు పెద్ద ప్రతికూలతగా మారింది. ఈ ఆలస్యానికి కొవిడ్ కూడా కొంత కారణం అయినప్పటికీ.. అందులో కొరటాల బాధ్యత కూడా ఉందన్న చర్చ అప్పట్లో నడిచింది. ఈ నేపథ్యంలోనే చిరు పరోక్షంగా ‘ఆచార్య’ సినిమాను దృష్టిలో ఉంచుకుని పంచ్ వేసినట్లు భావిస్తున్నారు.