విష్ణు కథ కొంచెం కొత్తగానే ఉంది

డెబ్యూ చిత్రం రాజావారు రాణిగారుతో డీసెంట్ సక్సెస్ అందుకుని రెండో మూవీ ఎస్ఆర్ కల్యాణమండపంతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న కిరణ్ అబ్బవరం వేగంగా సినిమాలు చేసే క్రమంలో వేసిన తొందరపాటు అడుగులు గట్టి పాఠాలే నేర్పించాయి. సమ్మతమే, సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సినవాడినేతో హ్యాట్రిక్ ఫ్లాపులు అందుకున్నాడు. వీటిలో మొదటిది కొంచెం డీసెంట్ అనిపించుకున్నా లవ్ స్టోరీలో ల్యాగ్ ఎక్కువైపోవడంతో ఆడియన్స్ కి ఎక్కలేదు. దెబ్బకు కొంత కాలం సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉన్న ఈ కుర్ర హీరో ఎట్టకేలకు కొత్తగా అనిపించే జానర్ తో వస్తున్నాడు.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన వినరో భాగ్యము విష్ణుకథ టీజర్ ఇందాకా విడుదలయ్యింది. కాన్సెప్ట్ వెరైటీగానే అనిపిస్తోంది. తిరుపతిలో ఉండే విష్ణు(కిరణ్ అబ్బవరం)ఓ అమ్మాయి(కశ్మీర)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అయితే ఆమె వెనుక ఒక అంకుల్(మురళి శర్మ)కూడా వెంటపడుతుంటాడు. అతన్ని సరదాగా పక్కకు తప్పించే క్రమంలో ఊహించని విధంగా విష్ణు జీవితంలో ఓ అనూహ్య సంఘటన జరుగుతుంది. బాంబ్ బ్లాస్ట్, పోలీసులు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఐఏ ఎంట్రీ, ఛేజులు ఇలా అన్ని రకాల ఎత్తులు పైఎత్తులు చూడాల్సి వస్తుంది. ఆ ప్రశ్నలకు సమాధానమే విష్ణు కథ.

టీజర్ ని ట్రైలర్ లెన్త్ లో కట్ చేశారు. క్యాస్టింగ్ తో పాటు కాన్సెప్ట్ కూడా ఆసక్తికరంగా ఉండటం చూస్తే కిరణ్ కి బ్రేక్ ఇవ్వదగిన అవకాశం దీనికే ఉందనిపిస్తోంది. మురళి శర్మతో వేయించిన బాలయ్య బన్నీ స్టెప్పులు మంచి కామెడీ స్టఫ్ గా తోస్తోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం, డేనియల్ విశ్వాస్ ఛాయాగ్రహణం క్వాలిటీకి తోడ్పడ్డాయి. రొటీన్ గా చేస్తే ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిప్పికొడుతున్న ట్రెండ్ లో కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు ఈ తరహా ప్రయత్నాలు చేయడం చాలా అవసరం. ఫిబ్రవరి 17 విడుదలలో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ ఇచ్చేశారు. శాకుంతలం, ధమ్కీ, సర్ లతో ఇది పోటీపడనుంది.