దిల్ రాజు కోరుకున్నది ఒకటి..

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కెరీర్లో ఎన్నడూ లేని సంకట స్థితిని ఎదుర్కొంటున్నాడు. ఓవైపు తెలుగులో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి క్రేజీ చిత్రాలను కాదని.. డబ్బింగ్ సినిమా అయిన ‘వారసుడు’కు ఎక్కువ థియేటర్లు అట్టి పెడుతుండడం పట్ల ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిందే.

దీనికి తోడు ‘వారసుడు’ తెలుగులో సమయానికి రిలీజవడం గురించి ఇప్పుడు కన్ఫ్యూజన్ నడుస్తోంది. మరోవైపు ‘వారసుడు’ ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడం, చాలా పాత తెలుగు సినిమాల కలబోతలా ఇది ఉండడం పట్ల నడుస్తున్న ట్రోలింగ్ సంగతి తెలిసిందే.

ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే.. విజయ్‌కు తిరుగులేని ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న తమిళనాడులో కూడా ఈ చిత్రానికి పరిస్థితులు ఏమంత కలిసి వస్తున్నట్లుగా కనిపించడం లేదు. తమిళనాట విజయ్ నంబర్ వన్ హీరో అని.. కాబట్టి సంక్రాంతికి ‘వారసుడు’కే ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని దిల్ రాజు అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే.

ఐతే ‘వారిసు’కు తమిళంలో ఎక్కువ థియేటర్లు దక్కడం మాట అటుంచితే.. అజిత్ సినిమా ‘తునివు’తో పోలిస్తే స్క్రీన్లు, షోలు తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ‘తునివు’ను రిలీజ్ చేస్తున్నది తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్. అతడికి బలమైన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉందక్కడ.

థియేటర్ల మీద అజమాయిషీ ఉంది. దీంతో ‘తునివు’కు ఎక్కువ స్క్రీన్లు వచ్చేలా చేసుకున్నాడు. మల్టీప్లెక్సుల్లో దానిదే పైచేయి. మంచి మంచి స్క్రీన్లు తన సినిమాకే దక్కేలా చూసుకున్నాడు. అంతే కాక ‘తునివు’కు అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు ప్లాన్ చేయించి.. మూడు గంటలు ఆలస్యంగా తెల్లవారుజామున 4 నుంచి విజయ్ మూవీకి బెనిఫిట్ షోలు పడేలా డిస్ట్రిబ్యూటర్లను ఒప్పించాడు. అతడి మాట ప్రకారమే అందరూ నడుచుకుంటున్నారు.

తమిళనాడు అవతల ‘వారసుడు’దే పైచేయిగా కనిపిస్తున్నప్పటికీ తమిళనాట మాత్రం ‘తునివు’ ఆధిపత్యమే కనిపిస్తోంది ప్రస్తుతానికి. రాజు కోరుకున్నదానికి పూర్తి భిన్నంగా అక్కడ పరిస్థితి ఉండడం చర్చనీయాంశం అవుతోంది.