నేనందరికీ నచ్చనని అర్థమైంది-రష్మిక

రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుండే కథానాయిక. ఇండియాలో ఆమెను మించిన పెద్ద స్టార్ హీరోయిన్లు ఉండొచ్చు కానీ.. ఆమెలా నిత్యం వార్తల్లో ఉండే కథానాయికలు అరుదు. కొన్నిసార్లు పాజిటివ్ విషయాలతో, కొన్నిసార్లు నెగెటివ్ విషయాలతో ఆమె పేరు వార్తల్లో నిలుస్తుంటుంది. ఇటీవల రెండు సందర్భాల్లో ఆమె పేరు చర్చనీయాంశం అయింది.

తాను ‘కాంతార’ సినిమా చూడలేదంటూ ఆమె చేసిన కామెంట్‌కు కన్నడిగులు నొచ్చుకుని ట్రోల్ చేశారు. తర్వాత సౌత్ సినిమాలతో పోలిస్తే బాలీవుడ్లో రొమాంటిక్ పాటలు ఎక్కువ అంటూ ఆమె చేసిన ఒక కామెంట్ కూడా చాలామందికి నచ్చలేదు. ఈ రెండు సందర్భాల్లో ఆమె బాగా ట్రోలింగ్‌కు గురైంది. ‘కాంతార’ వివాదానికి కొన్ని రోజుల తర్వాత రష్మిక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది కానీ.. సౌత్ సినిమాల గురించి చేసన వ్యాఖ్యలపై ఇప్పటిదాకా వివరణ ఇవ్వలేదు.

కాగా పర్టికుల్ కాంట్రవర్శీ అని చెప్పకుండా తన మీద సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ గురించి తాజాగా రష్మిక స్పందించింది. తాను అందరికీ నచ్చుతానని, అందరూ తనను ప్రేమిస్తూనే ఉండాలని అనుకోకూడదని తనకు ఆలస్యంగా తెలిసొచ్చిందని ఆమె వ్యాఖ్యానించడం విశేషం.

“ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల అందరి దృష్టీ మామీద ఉంటుంది. సొసైటీలో ప్రేమ, ద్వేషం అనేవి సర్వ సాధారణం. నటీనటులుగా మేం ఎన్నో ఇంటర్వ్యూల్లో, పబ్లిక్ ఫంక్షన్లలో పాల్గొంటాం. అందరితోనూ మాట్లాడతాం. ఈ క్రమంలో కొన్ని విషయాలు వివాదాస్పదం అవుతుంటాయి. నా విషయానికి వచ్చేసరికి నేను మాట్లాడే విధానం, వ్యవహార శైలి, హావభావాలు కొందరికి నచ్చకపోవచ్చు. అందుకే నా గురించి కామెంట్లు చేస్తున్నారనుకుంటా. నటీనటులుగా ప్రేక్షకులందరూ మమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండాలని అనుకోకూడదని నాకు అర్థమైంది. నెగెటివ్‌గా స్పందించే వాళ్లకు తోడు.. నేను ఎంతో మంది ప్రేమను కూడా పొందుతున్నా. వాళ్లందరికీ రుణపడి ఉంటా” అని రష్మిక వ్యాఖ్యానించింది.