‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఏ స్థాయిలో ప్రేక్షకుల మెప్పు పొందింతే.. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలకు కేంద్రమైన యుఎస్‌లో ఈ సినిమాను చూసి నేటివ్ అమెరికన్స్ ఎలా ఫిదా అయిపోయారో చూస్తూనే ఉన్నాం. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డులు వచ్చే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. స్వతంత్రంగా పలు విభాగాల్లో పోటీలో నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’.. కొన్ని అవార్డులకు బలమైన పోటీదారుగానే ఉంది.
ముఖ్యంగా బెస్ట్ డైరెక్టర్ పురస్కారం రాజమౌళిని వరిస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అకాడమీ అవార్డుల కంటే ముందే ఇచ్చే ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుకు ఇప్పటికే ఎంపికయ్యాడు జక్కన్న. తాజాగా అతిరథ మహారథుల మధ్య ఆ పురస్కారాన్ని అందుకున్నాడు. సంప్రదాయ భారతీయ వస్త్రధారణలో ఈ వేడుకకు హాజరైన వేదిక మీద ఆసక్తికర ప్రసంగం చేశాడు జక్కన్న. అక్కడ ఆయన ఏమన్నాడంటే..
‘‘ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వేదిక మీద నిలుచొని మాట్లాడడం కొంచెం కంగారుగా అనిపిస్తోంది. సినిమాను ఒక దేవాలయంగా భావిస్తాను. చిన్నపుడు థియేటర్లో సినిమా చూడ్డానికి వెళ్లినపుడు పొందిన ఆనందం.. ఇప్పటికీ గుర్తుంది. నేను ఏ సినిమా తీసినా.. ప్రతి సీన్‌ను చిత్రీకరించే ముందు ఈ సీన్ము థియేటర్లో ఎలా ఉంటుంది అని ఒక ప్రేక్షకుడిలా ఆలోచిస్తా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం నేను సినిమాలు తీస్తుంటా. కానీ ‘ఆర్ఆర్ఆర్’కు వచ్చేసరికి భారతీయులు ఎలాంటి ప్రేమను చూపించారో.. అదే అభిమానం, ఉత్సాహం విదేశీ ప్రేక్షకుల్లోనూ చూశా.
ఆర్ఆర్ఆర్ మీద విదేశీయులు సైతం అపరిమిత అభిమానం చూపించారు. న్యూయార్క్, చికాగో వెళ్లినపుడు థియేటర్లలో వారి ఆనందాన్ని ప్రత్యక్షంగా చూశా. మామూలుగా సినిమా యూనిట్‌ను తమ కుటుంబం అంటుంటారు. కానీ నా విషయంలో ఇది కాస్త భిన్నం. నా కుటుంబ సభ్యులే యూనిట్ సభ్యులు. నన్ను అత్యున్నత స్థానంలో నిలపడానికి వాళ్లంతా కష్టపడుతుంటారు. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటా’’ అని జక్కన్న చెప్పాడు.