మ‌ణిశ‌ర్మ కంపోజ్ చేస్తుంటే.. ప‌వ‌న్ కింద ప‌డుకుని

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఖుషి, గుడుంబా శంక‌ర్, బాలు, తీన్ మార్ లాంటి అదిరిపోయే ఆడియోలు ఇచ్చిన సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ‌. ఖుషి మిన‌హా సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆడ‌క‌పోయి ఉండొచ్చు కానీ.. వాటి ఆడియోల‌ను మాత్రం త‌క్కువ చేయ‌లేం. ఐతే ఈ సినిమాల ఆడియోలు అంత బాగా రావ‌డానికి ప‌వ‌న్ కూడా ఒక కార‌ణ‌మ‌ని అంటున్నాడు మ‌ణిశ‌ర్మ‌.

తాజాగా ఆయ‌న ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్‌తో త‌న అనుబంధం.. ప‌వ‌న్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ అనుభ‌వం గురించి మాట్లాడాడు. తాను ప‌ని చేసిన వాళ్ల‌లో ప‌వ‌న్ అంత మ్యూజిక్ సెన్స్ ఉన్న‌, అంత‌లా సంగీత చ‌ర్చ‌ల్లో ఇన్వాల్వ్ అయ్యే హీరో మ‌రొక‌రు క‌నిపించ‌లేద‌ని మ‌ణిశ‌ర్మ పేర్కొన‌డం విశేషం.

ప‌వ‌న్, త‌న కాంబినేష‌న్ అన‌గానే అంద‌రికీ ఖుషి సినిమానే గుర్తుకొస్తుంద‌ని.. కానీ గుడుంబా శంక‌ర్ ఆడియో ఖుషిని మించి ఉంటుంద‌ని.. అందులో ర‌క‌ర‌కాల పాట‌లుంటాయ‌ని.. అన్నీ చాలా బాగుంటాయ‌ని మ‌ణిశ‌ర్మ అన్నాడు.

ఈ సినిమాకు ట్యూన్స్ కంపోజ్ చేసేట‌పుడు ప‌వ‌న్ త‌న‌తోనే ఉన్నాడ‌ని.. తాను ట్యూన్స్ చేసుకుంటుంటే.. ప‌క్క‌నే నేల మీద కార్పెట్ వేసుకుని ప‌డుకునేవాడ‌ని.. ఏదో పుస్త‌కం చ‌దువుకుంటూ ఉండేవాడ‌ని.. తాను ఏదైనా ట్యూన్ వినిపిస్తే అది నచ్చ‌గానే ఎగిరి గంతేసినంత ప‌ని చేసేవాడ‌ని.. ప‌వ‌న్‌కు ప‌ది కోట్ల చెక్కు చేతికిస్తే ఏ ఎమోష‌న్ లేకుండా మామూలుగా ఉంటాడ‌ని.. కానీ మంచి ట్యూన్ వ‌స్తే మాత్రం చిన్న‌పిల్లాడిలా ఎగిరి గంతులేస్తాడ‌ని.. అదీ ఆయ‌న వ్య‌క్తిత్వం అని మ‌ణిశ‌ర్మ అన్నాడు.మ‌ళ్లీ ప‌వ‌న్‌తో ప‌ని చేయాల‌ని ఉంద‌ని.. కానీ అది త‌న చేతుల్లో లేద‌ని.. అది నిర్ణ‌యించాల్సింది ప‌వ‌న్ అని మ‌ణిశ‌ర్మ అన్నాడు.