ఇప్పుడంతా రీ రిలీజ్ ట్రెండ్ ఎంత ఉదృతంగా నడుస్తుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. పోకిరితో మొదలుకుని ఖుషీ దాకా గత నాలుగైదు నెలల నుంచి ఒక నిత్యప్రక్రియగా మారిపోయింది. అన్నీ ఒకే ఫలితాలు అందుకోనప్పటికీ మహేష్ పవన్ లాంటి స్టార్ హీరోలకు మాత్రం కొత్త సినిమాలకు మించిన వసూళ్లు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది మూవీ లవర్స్ తాము బాల్యంలో థియేటర్ ఎక్స్ పీరియన్స్ మిస్ అయినవాటిని మళ్ళీ చూడొచ్చనే నమ్మకంతో సదరు దర్శక నిర్మాతలకు ట్విట్టర్ వేదికగా విన్నపాలు చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి ఓ రిక్వెస్ట్ వచ్చింది.
1997లో వచ్చిన క్లాసిక్ సిందూరంని పునః విడుదల చేయమని ఓ అభిమాని కోరాడు. దానికి దర్శకత్వమే కాక నిర్మాణ భాగస్వామ్యంలోనూ కృష్ణవంశీ ఉన్నారు. హీరోగా రవితేజ కెరీర్ అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్నస్టేజి అది. బ్రహ్మాజీలో ఎంత గొప్ప ఆర్టిస్టు ఉన్నాడో ఋజువు చేసిన మూవీ కూడా ఇదే. నక్సల్ బ్యాక్ డ్రాప్ లో వాళ్లకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటంలో పోలీసులు సామాన్య ప్రజలు ఎలా నలిగిపోతున్నారో చెప్పిన తీరు అద్భుతంగా ఉంటుంది. అయితే నిన్నే పెళ్లాడతా లాంటి హోమ్లీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ నుంచి మరీ ఇంత సీరియస్ డ్రామాని ఎక్స్ పెక్ట్ చేయని ప్రేక్షకులకు ఇది నచ్చలేదు.
ఫలితంగా సిందూరం ఎంత బాగున్నా కమర్షియల్ గా ఆడలేదు. తీవ్ర నష్టాలు తెచ్చింది. దీనివల్లే తాను అయిదేళ్ళు అప్పులు తీర్చుకోవాల్సి వచ్చిందని సదరు నెటిజన్ కి కృష్ణవంశీ సమాధానం చెప్పి షాక్ ఇచ్చారు. నిజమేగా. పైగా ఇప్పుడు నక్సల్స్ కథలు ఆడియన్స్ కి అస్సలు కనెక్ట్ కావడం లేదు. అలాంటప్పుడు సిందూరంని తెచ్చినా రిస్కే. ప్రస్తుతం రంగమార్తాండ విడుదల కోసం ఎదురు చూస్తున్న కృష్ణవంశీ దాని షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసినా రిలీజ్ కు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ప్రకాష్ రాజ్ టైటిల్ రోల్ పోషించిన ఈ ఎమోషనల్ డ్రామాకు ఇళయరాజా సంగీతం అందించగా మరాఠి నటసామ్రాట్ కు అఫీషియల్ రీమేక్.