వినోదం ఆస్వాదించడం కోసం సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లే ప్రేక్షకులు తెరపై ఎన్నో వీరోచిత గాధలు, విన్యాసాలు, సెంటిమెంట్లు, విషాదాలు చూసుంటారు. కానీ తెరపై బొమ్మ ఆడుతుండగా ప్రాణాలు కోల్పోవడమనే భయంకరమైన సంఘటన కనీసం ఊహకు కూడా అందదు. బాలీవుడ్ చరిత్రలో బిగ్గెస్ట్ ట్రాజెడీగా ఇప్పటికీ దీని తాలూకు జ్ఞాపకాల్లో బాధితుల కుటుంబ సభ్యులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పుడా ఘటనే ట్రయిల్ బై ఫైర్ అనే మూవీ రూపంలో నెట్ ఫ్లిక్స్ లో త్వరలో విడుదల కాబోతోంది. ఒళ్ళు జలదరింపుకు గురయ్యే ఈ యాక్సిడెంట్ వెనుక ఎన్నో కథలున్నాయి.
1997 ఫిబ్రవరి 13న ఢిల్లీ గ్రీన్ పార్క్ ప్రాంతంలో ఉన్న ఉపహార్ థియేటర్లో జెపి దత్తా మల్టీస్టారర్ బోర్డర్ ఆడుతోంది. ఇండియన్ ఆర్మీ సాహసాలను గొప్పగా ఆవిష్కరించిన గొప్ప బ్లాక్ బస్టర్ అది. మధ్యాహ్నం 3 గంటల షో జరుగుతుండగా అగ్ని ప్రమాదం జరిగితే 59 ప్రేక్షకులు తొక్కిసలాటలో ఊపిరాడక అక్కడే నిలువునా మంటలకు ఆహుతయ్యారు. 100కి పైగా తీవ్రంగా గాయపడి నెలలు సంవత్సరాల తరబడి చికిత్స తీసుకున్నారు. దీని యజమానులు అన్సల్ బ్రదర్స్ ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేయడం రెండు దశాబ్దాలకు పైగా వివిధ న్యాయస్థానాల్లో సాగింది.
2015లో పలు తీర్పుల అనంతరం అరవై కోట్ల నష్టపరిహారం బాధితులకు ఇవ్వాలని సుప్రీమ్ కోర్టు జడ్జ్ మెంట్ వచ్చింది. ఇప్పుడిదంతా సినిమా రూపంలో వస్తోంది. అభయ్ డియోల్, ఆశిష్ విద్యార్ధి, అనుపమ్ ఖేర్ లాంటి నోటెడ్ క్యాస్టింగ్ ఉండటంతో పాటు చాలా రియలిస్టిక్ గా తీర్చిదిదినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. జనవరి 13న ఇది ఓటిటిలో రానుంది. ఫైర్ సేఫ్టీ విషయంలో థియేటర్లు నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతుందో ఉపహార్ ఉదంతమే ఉదాహరణ. దీని తర్వాతే వీటి మెయింటెనెన్స్ విషయంలో ప్రభుత్వాలు కఠినంగా ఉండటం మొదలయ్యింది. యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates