స‌మంత‌ను అమ్మ‌లా ర‌క్షించాల‌నుంది-రష్మిక‌

త‌న తోటి స్టార్ హీరోయిన్ అయిన స‌మంత గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది ర‌ష్మిక మంద‌న్నా. అనారోగ్యంతో బాధ ప‌డుతున్న స‌మంత‌కు అమ్మ‌లా మారి కాపాడుకోవాల‌ని ఉంద‌ని ఆమె వ్యాఖ్యానించ‌డం విశేషం. స‌మంత ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే స్త్రీ మూర్తి అంటూ ఆమెపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది ర‌ష్మిక‌.

త‌న కొత్త చిత్రం వార‌సుడు ప్ర‌మోష‌న్లలో భాగంగా ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్య‌లు చేసింది. సమంత మయోసైటిస్ అనే వ్యాధిక‌ గురైన విషయం ఆమె ప్రకటించిన తర్వాతే తనకు తెలిసిందని రష్మిక వెల్లడించింది. స‌మంత త‌న‌కు మంచి స్నేహితురాలే అయిన‌ప్ప‌టికీ.. గతంలో మయోసైటిస్ గురించి తమ మధ్యన ఎప్పుడూ ప్రస్తావన కూడా రాలేదని వివరించింది.

ఇటువంటి పరిస్థితుల్లో ఒక అమ్మలా మారి సమంతను కాపాడుకోవాలనుకుంటున్నానని, ఆమె వెన్నంటి నిలవాలనుకుంటున్నానని రష్మిక తెలిపింది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి నుంచి అందరూ స్ఫూర్తి పొందుతారని, ఆ విధంగా తాను కూడా సమంత నుంచి స్ఫూర్తి పొందుతానని రష్మిక పేర్కొంది. తాను ఎంతగానో ఇష్టపడే స‌మంత‌కు ఇకపై అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని తెలిపింది.

మ‌రోవైపు త‌న‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ట్లుగా త‌ర‌చుగా ప్ర‌చారంలో ఉండే విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ర‌ష్మిక మాట్లాడింది. త‌మ క‌ల‌యిక‌లో మ‌రో సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్త‌న్నార‌ని.. వాళ్ల కోరిక‌ను మ‌న్నిస్తూ మ‌ళ్లీ తాము సినిమా చేస్తామ‌ని ర‌ష్మిక తెలిపింది. విజ‌య్ వ‌ర్క్ త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని.. అత‌డితో ప‌ని చేయ‌డాన్ని ఆస్వాదిస్తాన‌ని ఆమె అంది. మంచి క‌థ కుద‌రాల‌ని.. అది జ‌రిగిన‌పుడు మ‌ళ్లీ త‌మ క‌ల‌యిక‌లో సినిమా వ‌స్తుంద‌ని ఆమె చెప్పింది.