ఆ నటుడితో సారీ చెప్పించిన మాస్ రాజా ఫ్యాన్స్

క్రిస్మస్ వీకెండ్లో విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా ‘ధమాకా’. మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం డివైడ్ టాక్, మిక్స్‌డ్ రివ్యూస్‌ను తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది. ట్రేడ్ పండిట్లు కూడా ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.100 కోట్ల గ్రాస్ మార్కును అందుకునేలా కనిపిస్తోంది. వీకెండ్ అవ్వగానే ఈ చిత్ర బృందం.. సక్సెస్ మీట్ నిర్వహించగా.. అందులో ఒక వివాదం చోటు చేసుకుంది.

ఏ స్టేజ్ ఎక్కినా అక్కడున్న హీరోను ఆకాశానికి ఎత్తేయడం అలవాటైన బండ్ల గణేష్.. ఈ వేడుకలో రవితేజకు కూడా ఓ రేంజిలో ఎలివేషన్ ఇచ్చాడు. రవితేజను పొగిడే క్రమంలో.. ఈ మధ్య కొంతమంది నటుడు రెండు మూడేళ్లకే సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అయిపోతున్నారని, రవితేజ అలా కాకుండా కష్టపడి పైకి వచ్చాడని వ్యాఖ్యానించాడు.

ఐతే బండ్ల గణేష్ సూపర్ స్టార్, మెగాస్టార్ అనే పదాలు వాడడం కొందరికి నచ్చలేదు. కమెడియన్ షకలక శంకర్ కూడా ఈ వ్యాఖ్యల మీద అభ్యంతరం వ్యక్తం చేశఆడు. మెగాస్టార్, సూపర్ స్టార్ ఊరికే అయిపోరని.. కష్టపడితేనే అవుతారని.. ఎవడో హీరో నీ ముందుంటే నువ్వు వెనుకా ముందు చూసుకోకుండా మైక్ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు అంటూ కౌంటర్ ఇచ్చాడు.

ఐతే శంకర్ ఫ్లోలో ‘‘ఎవడో హీరో నీ ముందు ఉంటే..’’ అంటూ పరోక్షంగా రవితేజను ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడాడని మాస్ రాజా అభిమానులకు కోపం వచ్చింది. అతను రవితేజకు సారీ చెప్పాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. శంకర్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో షకలక శంకర దిగిరాక తప్పలేదు. తాను చిరంజీవిని ఎంత అభిమానిస్తానో, రవితేజను కూడా అంతే అభిమానిస్తానని.. ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించాలని అతను వివరణ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దీంతో మాస్ రాజా ఫ్యాన్స్ శాంతించారు.