పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. నందమూరి బాలకృష్ణ నిర్వహించే ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్‌కు వస్తాడని కొన్ని నెలల ముందు ఎవరైనా అంటే నవ్వేవాళ్లేమో. మామూలుగా తన సినిమాల ప్రమోషన్లు చేయడమే కష్టం. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడమూ అరుదే.
అలాంటిది బాలయ్య నిర్వహించే షోలో పవన్ ఎలా పాల్గొంటాడు అన్న ప్రశ్నలే వినిపించాయి మొదట్లో వీళ్లిద్దరి కలయికలో ఎపిసోడ్ గురించి రూమర్లు వచ్చినపుడు. కానీ తర్వాత ఆ ఊహాగానాలే నిజమయ్యాయి. పవన్ నిజంగానే బాలయ్య షోలో అడుగు పెట్టాడు. ఇటీవలే ఆ షో షూట్ కూడా పూర్తయింది.
ఈ షోలో బాలయ్య ఏం అడిగి ఉంటాడు.. పవన్ ఏం మాట్లాడి ఉంటాడు.. సినిమాల గురించే కాక వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి ఇద్దరి మధ్య ఏం చర్చ జరిగి ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఐతే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసే రోజేదో ఒక క్లారిటీ వచ్చేసినట్లే.
సంక్రాంతి కానుకగా జనవరి 13న బాలయ్య-పవన్ ఎపిసోడ్‌ను ప్రసారం చేయబోతున్నారట. ఈ మేరకు ప్రోమో కూడా రెడీ అయిపోయినట్లు సమాచారం. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రిలీజైనట్లే ‘అన్‌స్టాపబుల్’లో కొత్త ఎపిసోడ్లు రిలీజ్ చేయడం ఆహా వారికి ఆనవాయితీ.
ఈ ప్రకారమే జనవరి 13న శుక్రవారం పవన్ ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఎపిసోడ్ ఖరారైన దగ్గర్నుంచి పవన్ తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా మూడు పెళ్ళిళ్ళ గురించి ఈ షోలో మాట్లాడతాడా అనే విషయంలో పెద్ద చర్చ నడుస్తోంది.
వైకాపా వాళ్లు, వారి అనుకూల మీడియాలో ఇదే విషయమై రకరకాల ఊహాగానాలు ప్రచారం చేస్తున్నారు. ఆ విషయం అడగొద్దని షరతులు పెట్టినట్లు చెబుతున్నారు. కానీ పవన్ ఆ విషయమే మాట్లాడి తనను విమర్శించే అందరికీ చెంపపెట్టు లాంటి సమాధానం చెబుతారని షో వర్గాలు అంటున్నాయి. నిజంగా అలా జరిగి ఉంటే ప్రోమోలోనే ఆ విషయం హైలైట్ అవడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates