దేవీకి మళ్లీ వాయింపుడే

ఒకప్పుడు టాలీవుడ్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ది ఏకఛత్రాధిపత్యం. మణిశర్మ హవా తగ్గాక కొంత కాలం ఆర్పీ పట్నాయక్‌ నుంచి పోటీని ఎదుర్కొన్న దేవి.. ఆ తర్వాత తిరుడగులేని ఆధిపత్యం చలాయించాడు. తర్వాతి కాలంలో తమన్ నుంచి పోటీ ఎదురైనా దేవి తగ్గింది లేదు. ప్రతి ఆల్బంలోనూ చార్ట్ బస్టర్ పాటలతో ఇటు క్లాస్‌ను, అటు మాస్‌ను ఒక ఊపు ఊపేసేవాడు దేవి.

కానీ ఎలాంటి సంగీత దర్శకుడైనా ఒక దశ దాటాక మూస ట్యూన్లతో విసుగెత్తించడం.. అంచనాలను అందుకోలేకపోవడం కామనే. దేవి కూడా అందుకు మినహాయింపు కాలేకపోయాడు. గత మూణ్నాలుగేళ్ల నుంచి దేవి నుంచి ఆశించిన స్థాయిలో ఆల్బమ్స్ రావట్లేదు. రొటీన్, మొక్కుబడి ట్యూన్లతో లాగించేస్తున్నాడు. ఈ సంక్రాంతిక ిరాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’ విషయంలోనూ దేవి సంతృ‌ప్తిపరిచే ఆల్బం ఇవ్వలేదు. తొలి పాట ‘బాస్ పార్టీ’.. రెండో పాట ‘నువ్వు శ్రీదేవైతే..’ సోసోగా అనిపించాయి.

తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్లు.. ఈ పాటలు కూడా వినగా వినగా పర్వాలేదనిపించాయి కానీ.. మెజారిటీ అభిమానులు అసంతృప్తితోనే కనిపించారు. ఐతే ఈ మధ్యే రిలీజ్ చేసినా ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్ మాత్రం అభిమానులను బాగా ఆకట్టుకుంది. మంచి బీట్ ఉండి ఊపుతో సాగడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.

అందులో లిరిక్స్ ఒక రేంజిలో ఉండడం, అలాగే విజువల్స్ కూడా బాగుండడంతో పాట ఇన్‌స్టంట్ హిట్టయింది. ఎట్టకేలకు దేవి అంచనాలు అందుకున్నాడు, చిరుకు మంచి ఎలివేషన్ ఇచ్చే సాంగ్ ఇచ్చాడని సంతోషించారు. కానీ ఈ సంతోషం కొన్ని రోజులకే ఆవిరైపోయింది. ‘పూనకాలు లోడింగ్’ అంటూ ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కొత్త పాట ఆకట్టుకోలేకపోయింది.

చిరు-రవితేజ కలయికలో సాంగ్.. పైగా ‘పూనకాలు లోడింగ్’ అనే టైటిల్ చూసి ఏదో అనుకుంటే.. పాట చాలా మామూలుగా సాగిపోవడం.. వినసొంపుగా లేకపోవడం.. అంత ఊపు కూడా లేకపోవడంతో దేవి మళ్లీ ట్రోల్స్‌కు టార్గెట్ అయిపోయాడు. ముఖ్యంగా ఈ పాటలో బూర ఊదే సౌండింగ్ చికాకు పెట్టింది. దేవి స్వయంగా బూర ఊదుతూ లిరికల్ వీడియోలో కనిపించడంతో అతణ్ని నెటిజన్లు ఒక ఆట ఆడేసుకుంటున్నారు.