సమంత క్యారెక్టర్‌పై ఊరిస్తున్న ప్రియమణి

సౌత్ ఇండియన్ ఫిలిం స్టార్స్ చాలామంది వెబ్ సిరీస్‌లను తక్కువగా చూస్తున్నారు. వాటిలో నటించడానికి అంతగా ఆసక్తి చూపించట్లేదు. ఎక్కువగా చిన్న స్థాయి, డిమాండ్ లేని ఆర్టిస్టులే వీటిలో నటిస్తున్నారు. ఇలాంటి సమయంలో సమంత లాంటి అగ్ర కథానాయిక ధైర్యంగా డిజిటల్ ఎంట్రీకి రెడీ అయిపోయింది. ఆమె తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్-2’. అమేజాన్ ప్రైమ్ కోసం రాజ్-కృష్ణ ఈ సిరీస్‌ను రూపొందించారు.

‘ఫ్యామిలీ మ్యాన్’ తొలి సిరీస్ చక్కటి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మనోజ్ బాజ్‌పేయి అందులో కథానాయకుడిగా నటించాడు. సెకండ్ సీజన్లోనూ అతనే హీరో. అతడికి భార్యగా ప్రియమణి పాత్ర ఇందులోనూ కొనసాగనుంది. మరి ఇందులో సమంత పాత్ర ఏంటి అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

ఐతే ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో సమంతది నెగెటివ్ రోల్ అని.. ఆమె టెర్రరిస్టుగా కనిపించనుందని ఓ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రియమణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఫ్యామిలీ మ్యాన్-2’లోనూ తన పాత్ర కొనసాగుతుందని.. మనోజ్‌కు భార్యనే తన క్యారెక్టర్ ఉంటుందని ఆమె చెప్పింది.

ఇక సమంత పాత్ర గురించి అడిగితే.. అది ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేలా ఉంటుందని ఆమె అంది. తన పాత్రకు సంబంధించి లైన్ విన్నానని.. అది చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించిందని.. ఆ పాత్ర కోసం అందరూ ఎదురు చూడాలని అంది ప్రియమణి. ఈ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే సమంత పాత్ర ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ చూడని విధంగా ఉంటుందని స్పష్టమవుతోంది. లాక్ డౌన్ వల్ల కొంత పార్ట్ చిత్రీకరణ ఆగిపోయింది. త్వరలోనే అది పూర్తి చేసి ‘ఫ్యామిలీ మ్యాన్’ను ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.