అభిమానుల్ని కొట్టడంపై బాలయ్య లాజిక్


నందమూరి బాలకృష్ణ తన అభిమానులతో వ్యవహరించే తీరు తరచుగా చర్చనీయాంశం అవుతుంటుంది. ఆయన పలు సందర్భాల్లో అభిమానులను కొట్టారు. కొన్ని సందర్భాల్లో వాళ్ల ఫోన్లు విసిరేశారు. బాలయ్య జనాల్లోకి వెళ్లినపుడు అభిమానులు ఆయన్ని చూడ్డానికి, చెయ్యి కలపడానికి మీద పడడం.. ఆ క్రమంలో బాలయ్య సహనం కోల్పోయి కొట్టడం చాలాసార్లు జరిగింది. ఐతే బాలయ్య కొట్టినా సంతోషమే, తమకేమీ బాధ లేదని అంటుంటారు అభిమానులు.

బాలయ్య ఓ సందర్భంలో దీనిపై మాట్లాడుతూ.. తాను కొట్టినా అభిమానులు పట్టించుకోరని, తన చేయి తాకిందని సంతోషిస్తారని వ్యాఖ్యానించారు. దీని గురించి పూరి జగన్నాథ్ మ ాట్లాడుతూ.. బాలయ్యకు బౌన్సర్లు ఉండరని, తన అభిమానులను తనే అదుపు చేసుకుంటాడని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కాగా ఇప్పుడు స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా ఈ టాపిక్ మీద ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

అభిమానులను కొట్టడం గురించి ఓ సందర్భంలో బాలయ్య దగ్గర ప్రస్తావిస్తే ఆయన ఇచ్చిన జవాబు చూసి తాను షాకైనట్లు సాయిమాధవ్ వెల్లడించాడు. మామూలుగా వేరే హీరోలు అభిమానుల నుంచి కాపాడుకోవడానికి బౌన్సర్లను పెట్టుకుంటారని.. ఎవరైనా అభిమానులు మీదికొస్తే వెనక్కి నెట్టేయడం, లేదా కొట్టడం లాంటివి ఈ బౌన్సర్లు చేస్తుంటారని.. ఒక రకంగా చెప్పాలంటే అభిమానులను కొట్టడానికే జీతాలిచ్చి బౌన్సర్లను పెట్టుకుంటారని బాలయ్య అభిప్రాయపడ్డాడట. నా అభిమానులను కొట్టడానికి బౌన్సర్లు ఎవరు.. వాళ్లను కొడితే గిడితే నేనే కొడతా.. వాళ్లు బాధ పడితే తనతోనే డీల్ చేసుకుంటారు అని బాలయ్య వ్యాఖ్యానించాడట. అసలు హీరోలు బౌన్సర్లను పెట్టుకోవడం ఏంటి అని బాలయ్య ప్రశ్నించాడట.

తనకు, అభిమానులకు మధ్య ఎవరూ ఉండకూడదని.. వాళ్లు తన కుటుంబం అని.. కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టడంలో తప్పేమీ లేదని బాలయ్య చెప్పాడని.. ఈ సమాధానం తనకెంతో నచ్చిందని సాయిమాధవ్ వెల్లడించారు. ఈ విషయం ఓపెన్‌గా చెప్పమని అంటే.. తనకా అలవాటు లేదని, ఎవరేమనుకున్నా పర్వాలేదని బాలయ్య చెప్పాడట.