తెలుగు వారి ఓటీటీ ఆహా మూడేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ జరగనిది గురువారం రాత్రి జరిగింది. ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగిపోయి ఆహా సర్వర్ డౌన్ అయిపోయింది. కొన్ని గంటల పాటు యాప్ ఓపెన్ కాలేదు. ఉన్నట్లుండి ఈ డిమాండ్ ఏంటి.. సర్వర్ డౌన్ అయ్యేలాగా ఏం జరిగిపోయింది అంటే.. అదంతా ప్రభాస్ అభిమానుల పుణ్యమే. నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ కోసం చేస్తున్న సూపర్ హిట్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ కోసం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్ వచ్చాడు.
ప్రభాస్ తెర మీద చాలా సందడి చేస్తాడు కానీ.. బయట మాట్లాడ్డం చాలా తక్కువ. సినిమా వేడుకల్లో కూడా విపరీతంగా మొహమాట పడతాడు. మొక్కుబడిగా నాలుగు ముక్కలు మాట్లాడేసి వెళ్లిపోతాడు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా తక్కువ. సోషల్ గ్యాదరింగ్స్ కూడా తక్కువే. దీంతో అతడి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం అందరిలోనూ ఉంది.
‘అన్‌స్టాపబుల్’లో ప్రభాస్ ఎపిసోడ్ చూశాక ఆహా సర్వర్ డౌన్ అవడంలో ఆశ్చర్యం లేదనిపిస్తుంది. అంత ఆసక్తికరంగా, ఉత్సాహంగా సాగింది ఎపిసోడ్. ‘అన్ స్టాపబుల్’లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించేలా ఈ ఎపిసోడ్‌ను నడిపించారు బాలయ్య, ప్రభాస్.
స్వతహాగా ప్రభాస్ అంటే నో నాన్సెన్స్ పర్సన్. ఎంత ఎదిగినా ఆ అహంకారం కనిపించదు. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడడు. ఎవరినీ పల్లెత్తు మాట అనడు. ఎక్కువ హంగామా, షో చేయడు. కొందరు మంచి వాళ్లలా నటిస్తున్నా.. అసలు స్వరూపం బయటికి కనిపించేస్తుంటుంది. బిల్డప్ మామూలుగా ఉండదు. ఇలాంటి టాక్ షోలకు వచ్చారన్న మాటే కానీ.. ఓపెన్‌గా ఉండరు. కానీ ప్రభాస్ అలా కాదు. అతడిలో ఒక నిజాయితీ కనిపిస్తుంది. ప్రభాస్ మంచోడు అనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంటుంది. ఎంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినా కూడా ఒక మామూలు వ్యక్తిలా బాలయ్యతో సరదాగా గడిపిన, మాట్లాడిన తీరు ప్రభాస్ అభిమానులకే కాదు.. మిగతా వాళ్లకు కూడా తెగ నచ్చేసింది. ఇంత పాజిటివిటీ ఉన్న హీరోలు చాలా అరుదుగా కనిపిస్తారు.