గొప్ప ద‌ర్శ‌కుడు.. అదేం కామెంట్ సార్?

R Balki

బాలీవుడ్లో విభిన్న‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు ఆర్.బాల్కి. ఆయ‌న అస‌లు పేరు ఆర్.బాల‌కృష్ణ‌న్‌. దాన్ని బాల్కిగా కుదించుకున్నారు. అస‌లు పేరు చూస్తే ఆయ‌న సౌత్ ఇండియ‌న్ అనే విష‌యం అర్థ‌మైపోతుంది. ఎక్కువ‌గా త‌న సినిమాల‌కు సౌత్ ఇండియ‌న్ లెజెండ్ ఇళ‌య‌రాజాతోనే మ్యూజిక్ చేయించుకున్నారాయ‌న‌.

పా, ష‌మితాబ్, ప్యాడ్ మ్యాన్ లాంటి సినిమాల‌తో గుర్తింపుతో పాటు గౌర‌వం కూడా సంపాదించుకున్న బాల్కి.. బాలీవుడ్లో నెపోటిజం గురించి జ‌రుగుతున్న పెద్ద చ‌ర్చ‌లోకి తాను కూడా వ‌చ్చాడు. కానీ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చాలామందికి ఆశ్చ‌ర్యం క‌లిగించాయి. ఆగ్ర‌హం కూడా తెప్పించాయి.

నెపోటిజం ఏ రంగంలో లేదంటూ ప్ర‌శ్నించిన బాల్కి.. ధీరూబాయి అంబానీ త‌ర్వాత ముకేష్ అంబాని కాకుండా రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌ను బ‌య‌టి వ్య‌క్తి ఎవ‌రైనా న‌డిపిస్తున్నారా అని ప్ర‌శ్నించారు. ఇలాగే ప్ర‌తి రంగంలోనూ ఉంటుంద‌ని.. ప్ర‌తి తండ్రీ తానేం చేస్తుంటే దాన్ని పిల్ల‌ల‌కు వార‌స‌త్వంగా ఇస్తాడ‌ని.. సినీ రంగంలోనూ అంతే అని.. నెపోటిజం త‌న దృష్టిలో త‌ప్పే కాద‌ని అన్నాడు బాల్కి. టాలెంట్ లేకుండా ఎవ్వ‌రూ ఇక్క‌డ నిల‌దొక్కుకోలేర‌ని.. వార‌స‌త్వం తొలి సినిమా వ‌ర‌కే ప‌ని చేస్తుంద‌ని బాల్కి అన్నాడు.

కాక‌పోతే సినీ కుటుంబం నుంచి వ‌చ్చిన వాళ్ల‌కు అరంగేట్రం తేలిక అని.. బ‌య‌టి వాళ్ల‌కు అది క‌ష్ట‌మ‌ని అన్నాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ.. వార‌స‌త్వ న‌టులైన ర‌ణ‌బీర్ క‌పూర్, ఆలియా భ‌ట్‌ల కంటే ప్ర‌తిభ ఉన్న వాళ్లెవ‌రైనా ఉంటే చూపించండి.. అప్పుడు నేను ఈ విష‌యంలో వాదించ‌డానికి సిద్ధం అంటూ ఆయ‌న ఒక స‌వాల్ విసిరారు. ఇది అంద‌రి ఆగ్ర‌హం తెప్పిస్తోంది.బాల్కి లాంటి ఆలోచ‌నాప‌రుడైన ద‌ర్శ‌కుడు ఇలాంటి వ్యాఖ్య చేసి ఉండాల్సింది కాద‌న్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది.