చెప్పినట్లే ‘వింటేజ్ చిరు’ను చూపిస్తున్నాడే..

యువ దర్శకుడు బాబీ.. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. టీనేజీలో అతను గుంటూరు జిల్లాలో చిరంజీవి అభిమాన సంఘంలో కీలకంగా వ్యవహరించాడు. చిరు మీద తన అభిమానాన్ని పలు సందర్భాల్లో అతను వ్యక్తం చేశాడు. అలాంటి అభిమానికి తన ఆరాధ్య కథానాయకుడిని డైరెక్ట్ చేసే అవకాశం లభించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఒక అభిమానిగా చిరును ఎలా చూడాలని తాను కోరుకుంటానో అలాగే చూపిస్తానని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నాడు బాబీ.

ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినపుడే అభిమానులకు వింటేజ్ చిరు కనిపించాడు. ‘ముఠామేస్త్రి’ లుక్‌ను గుర్తు చేసేలా ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేశారు. ఆ తర్వాత రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్లోనూ ‘ముఠా మేస్త్రి’ సహా చిరు పాత సినిమాల ఛాయలు కొన్ని కనిపించాయి. ‘బాస్ పార్టీ’ పాటలోనూ వింటేజ్ చిరును గుర్తుకు తెచ్చాడు బాబీ.

ఆ తర్వాత రిలీజ్ చేసిన ‘శ్రీదేవి’ పాటలో చిరుకు సంబంధించి కొన్ని వింటేజ్ పాటల మూమెంట్స్‌ను గుర్తుకు తెచ్చాయి. ‘ఇంద్ర’ అంత స్పీడు లేకపోయినా అందులోని వీణ స్టెప్‌ను గుర్తుకు తెచ్చే మూమెంట్ ఒకటి చేశాడు చిరు. అలాగే తన పాత స్టైల్‌ను గుర్తుకు చేసే ఒక మూమెంట్ కూడా చేశాడు. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ అన్నింటికంటే ఎక్కువ కిక్ ఇస్తోంది. హీరోయిజంను అదిరిపోయేలా ఎలివేట్ చేస్తూ సాగిన ఈ పాట లిరికల్ వీడియోతోనే అభిమానులకు పూనకాలు తెప్పించింది.

ఇప్పటిదాకా ‘పూనకాలు లోడింగ్’ అంటుంటే అది మాట వరసకు అన్నట్లే ఉండేది కానీ.. ఇప్పుడు మాత్రం నిజంగా ఆ మాట అభిమానుల నోటి నుంచి వినిపిస్తోంది. ఈ పాట చూసిన చాలామందికి చిరు ‘లంకేశ్వరుడు’ సినిమా గుర్తుకొస్తోంది. అదే లుక్‌లో గన్ను పట్టుకుని చిరు ఇచ్చిన పోజులు నిన్నటితరం అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తున్నాయి. మొత్తానికి బాబీ ముందు అన్నట్లే ‘వింటేజ్ చిరు’ను గుర్తుకు తెస్తూ ముందుకు సాగుతున్నాడు. సినిమాలో కూడా అదే ఫీలింగ్ తీసుకొచ్చి అభిమానులను అలరిస్తాడేమో చూడాలి.