రవితేజ.. ఇక వీటికే అంకితం

ఎవరైనా ఒక హీరో అదే పనిగా మాస్ సినిమాలు, రొటీన్ మసాలా చిత్రాలు చేస్తుంటే.. ఎప్పుడూ ఇవేనా అన్న అసంతృప్తి వ్యక్తమవుతుంటుంది. ఆ హీరోను కొంచెం చిన్న చూపు చూస్తారు. కానీ ఇలాంటి హీరోలు తమ ఇమేజ్‌ను దాటి సినిమాలు చేసిన ప్రతిసారీ ఎదురు దెబ్బ తగులుతుంటే వాళ్లు మాత్రం ఏం చేయగలరు అన్న ప్రశ్న తలెత్తుతుంది. Raviteja విషయంలో ఎప్పుడూ జరిగేది ఇదే.

కెరీర్లో రవితేజ హిట్లన్నీ మాస్ సినిమాలతో వచ్చినవే. అందుకే ఆయనకు ‘మాస్ రాజా’ అని పేరొచ్చింది. ఐతే కొన్నిసార్లు మరీ రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేస్తుంటాడు రవితేజ. అలాంటపుడు విమర్శలు వస్తుంటాయి. అందుకని రూటు మార్చి డిఫరెంట్ సినిమాలు ట్రై చేస్తుంటాడు. కానీ వాటికి దారుణమైన ఫలితాలు వస్తుంటాయి. నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో, సారొచ్చారు, డిస్కో రాజా.. ఇలా ఈ వరుసలో చాలా సినిమాలే ఉన్నాయి. ఇవన్నీ కూడా మాస్ రాజాకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి.

అయినా సరే.. ఆశ వదులుకోకుండా ఈ మధ్య ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే డిఫరెంట్ మూవీ చేశాడు మాస్ రాజా. కానీ అది మరింత దారుణమైన ఫలితాన్నందుకుంది. రవితేజ కెరీర్లోనే అతి తక్కువ ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్లు తెచ్చుకున్న చిత్రాల్లో ఇదొకటిగా నిలిచింది. కానీ దీని తర్వాత రవితేజ మళ్లీ తన రూట్లోకి వెళ్లిపోయి ‘Dhamaka’ సినిమా చేశాడు. అది ఇటీవలే విడుదలైంది.

‘రామారావు’ ఎఫెక్ట్ వల్లేమో.. రిలీజ్ ముంగిట ఈ సినిమాకు హైప్ కనిపించలేదు. కానీ రిలీజ్ రోజు ఈ సినిమా వసూళ్ల మోత మోగించింది. డివైడ్ టాక్ వచ్చినా తట్టుకుని వీకెండ్ అంతా అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. సినిమా ‘హిట్’ స్టేటస్ అందుకోవడంలో సందేహాలేమీ లేవు. రొటీన్ కథాకథనాలతో తెరకెక్కిన సినిమానే అయినా రవితేజ నుంచి మాస్ ప్రేక్షకులకు కోరుకునే అంశాలకు లోటు లేకపోవడంతో ఈ సినిమా పాసైపోయింది. రొటీన్ అనిపించినా సరే.. రవితేజకు మాస్ సినిమాలు మాత్రమే సెట్ అవుతాయని ఈ చిత్రంతో మరోసారి రుజువైంది. ఈ విషయంలో మరోసారి పాఠం నేర్చుకున్న రవితేజ.. ఇక మళ్లీ ప్రయోగాల జోలికి వెళ్లకుండా మాస్ మసాలా సినిమాలకే పరిమితం అయిపోతాడేమో.