టాలీవుడ్ మరో దిగ్గజ నటుడిని కోల్పోయింది. విలన్, క్యారెక్టర్ రోల్స్‌తో గొప్ప పేరు సంపాదించి నాలుగైదు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన Chalapathi Rao గుండెపోటుతో కన్నుమూశారు. ఇప్పటికే కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణలను తక్కువ వ్యవధిలో కోల్పోయిన విషాదంలో ఉన్న టాలీవుడ్‌కు ఇది మరో షాక్.
Chalapathi Rao అనారోగ్యం గురించి ఎక్కడా ఈ మధ్య వార్తలే రాలేదు. ఆయనది హఠాన్మరణం అని తెలుస్తోంది. తన తండ్రి ఏ బాధా లేకుండా ప్రశాంతంగా తుది శ్వాస విడిచారని రవిబాబు చెప్పడం చూస్తే.. ఆయనేమీ పెద్ద అనారోగ్య సమస్యలతో మంచం పట్టలేదని అర్థమవుతోంది.
కాకపోతే కొన్నేళ్ల నుంచి Chalapathi Rao లైమ్ లైట్లో లేకపోవడం, ఎప్పుడో కానీ సినిమాల్లో నటించకపోవడం.. బయట కూడా సినిమా వేడుకల్లో ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన మరణం సడెన్ షాక్ లాగా అనిపిస్తోంది అందరికీ.
గతంలో సినిమా వేడుకల్లో, ఇంకేవైనా కార్యక్రమాల్లో చలపతిరావు కనిపించేవారు. కానీ ఒక వివాదం కారణంగా ఆయన ఇంటికి పరిమితం అయిపోయారు. నాగచైతన్య సినిమా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా యాంకర్ సరదాగా.. ‘‘అమ్మాయిలు హానికరమా’’ అని అతిథులు ఒక్కొక్కకరిని అడుగుతుంటే.. చలపతిరావు తన వంతు వచ్చేసరికి ‘‘అమ్మాయిలు హానికరం కాదు కానీ.. పక్కలోకి పనికొస్తారు’’ అనేశారు. ఆ మాట పెను దుమారమే రేపింది.
సోషల్ మీడియాలో ఆ మాటను వలువలు చిలువలు చేసి.. ఆయన మీద తీవ్ర స్థాయిలో మాటల దాడి చేశారు. దీని పై రవిబాబు మీడియాకు సర్దిచెప్పారు. పెద్ద వయస్కుడు, కొంచెం చాదస్తంతో ఏదో మాట్లాడేశారు.. ఇక ఈ వివాదాన్ని వదిలేయాలని మీడియాను కోరారు. ఐతే ఈ వివాదాన్ని సోషల్ మీడియా జనాలు మరీ పెద్దది చేసి చలపతిరావు స్థాయి చూడకుండా తీవ్ర స్థాయిలో దాడి చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదం తర్వాత ఎందుకొచ్చిన గొడవని ఆయన సినిమా వేడుకల్లో పాల్గొనడమే మానేశారు.