మనిషి భౌతికంగా లేకపోయినా ఎప్పటికీ సజీవంగా నిలిచిపోయే అవకాశం ఒక్క సినిమాల ద్వారానే దక్కుతుంది. రాజకీయ నాయకుడు చనిపోతే ఫోటోల్లో తప్ప పెద్దగా జ్ఞాపకం చేసుకోము. కానీ ఒక నటుడు వెళ్ళిపోతే టీవీలోనో యుట్యూబ్ లోనో ఓటిటిలోనూ చూస్తూనే ఉంటాం, వాళ్ళు బ్రతికే ఉన్నారన్న భావనను ఆస్వాదిస్తూనే ఉంటాం.
అలాంటి మహనుభావులలో కైకాల సత్యనారాయణ ఒకరు. తెలుగు కళామతల్లిని శోకంలో ముంచెత్తుతూ స్వర్గానికేగిన ఈ నవరసనటనా సార్వభౌములు స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ దాకా ఎన్నో తరాలతో నటించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. చిరస్మరణీయ పాత్రలతో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు
కృష్ణాజిల్లా కౌతవరంలో 1935లో జన్మించిన కైకాల సత్యనారాయణ డిగ్రీ దాకా చదువుకున్నారు. నాటకాలంటే చిన్నప్పటి నుంచే విపరీతమైన పిచ్చి. మొదట్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయేవి. 1959లో సిపాయి కూతురుతో మొదటిసారి తెరమీద కనిపించారు. అది విజయం సాధించకపోయినా కృంగిపోక తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండేవారు.
రూపం ఎన్టీఆర్ ను పోలి ఉండటంతో ఆయనకు డూప్ గా పని చేసే సమయంలో దగ్గరయ్యే అదృష్టం దక్కించుకున్నారు. కనకదుర్గా పూజామహిమలో చేసిన విలన్ వేషం కైకాలకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. వీటికే పరిమితం కాకుండా ఉమ్మడి కుటుంబం, శారదాలో సెంటిమెంట్ తో కూడిన పాత్రల్లోనూ అద్భుతంగా మెప్పించి ఏ వేషమైనా సరే బ్రహ్మాండంగా ఒప్పుతారనే పేరు తెచ్చుకున్నారు
1977 యమగోల సత్యనారాయణ గారికి మరో గొప్ప మేలిమలుపు. నరకంలో నిజం యముడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు కానీ ఈయన మాత్రం జనం మనసులో అలా ముద్రపడిపోయారు. 1980 తర్వాత చిరంజీవి బాలకృష్ణ సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలను నభూతో నభవిష్యత్ అన్న రీతిలో పోషించారు. ప్రేమనగర్, అడవిరాముడు, బొబ్బిలిరాజా, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు లాంటి బ్లాక్ బస్టర్స్ లో పాజిటివ్ నెగటివ్ అన్నీ మెప్పించారు.
స్టేట్ రౌడీ, అగ్ని పర్వతం లాంటి చిత్రాల్లో కామెడీ విలనీ కోసం చూపించిన ప్రత్యేక టైమింగ్ ఎందరికో దిక్సూచి లాంటిది. ఫుల్ లెన్త్ పరంగా చివరి సినిమా అరుంధతి కాగా బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడులో ఒక సీన్లో కనిపిస్తారు. ఇవే స్క్రీన్ పై ఆఖరి దర్శనాలు
సత్యనారాయణ నిర్మాతగానూ గొప్ప అభిరుచి చూపించారు. 1990లో భారీ బడ్జెట్ కౌబాయ్ చిత్రం కొదమసింహం ఇప్పటికీ మెగా ఫాన్స్ కి ఇష్టమైన మూవీ. బంగారు కుటుంబంకు నంది అవార్డు దక్కింది. బాలయ్యతో ముద్దుల మొగుడు తీశారు. వారసుల్లో ఇద్దరు మగ సంతానం ఇద్దరు అమ్మాయిలు ఎవరూ నటన వైపు రాలేదు. కెజిఎఫ్ నిర్మాణ భాగస్వామ్యంలో కైకాల కుటుంబం తరఫున రెండో అబ్బాయి కీలకంగా వ్యవహరించారు. 2011లో కైకాల రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు.
పద్మ అవార్డు దక్కకపోవడం అభిమానులు వెలితిగా భావిస్తారు. అవార్డులు వచ్చినా రాకపోయినా ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించిన కైకాలసత్యనారాయణ గారు కేవలం ఈ లోకం నుంచే సెలవు తీసుకున్నారు. సినిమా ప్రేమికుల హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవే
This post was last modified on December 23, 2022 5:17 pm
భాగ్యనగరి హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. భారత గణతంత్ర దినోత్సవాన తన పార్టీ శ్రేణులకు కొత్త మార్గదర్శకాలు…
నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పాలి. బాలయ్య నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి హిట్ల మీద…
రాజకీయ నేతలు నిత్యం బిజీ షెడ్యూల్ తో సాగిపోతూ ఉంటారు. ఇక అధికారంలో ఉన్న పార్టీల నేతలైతే.. క్షణం తీరిక…
భారత గణతంత్ర దినోత్సవం నాడు ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ నేతల ఓ కీలక సమావేశం జరిగింది. పార్టీలో క్రియాశీలక…
మూడేళ్ళ క్రితం చిరంజీవి గాడ్ ఫాదర్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడానికి ప్రధాన కారణం ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ లో…