తెలుగు ప్రేక్ష‌కుల‌పై డ‌బ్బింగ్ బాంబు

భాషా భేదం లేకుండా ఏ సినిమానైనా ఆద‌రించే పెద్ద మ‌న‌సు తెలుగు ప్రేక్ష‌కుల‌ది. అందుకే వివిధ భాష‌ల నుంచి డ‌బ్బింగ్ చిత్రాలు తెలుగులోకి పెద్ద ఎత్తున వ‌స్తుంటాయి. వాటిలో బాగున్న సినిమాల‌ను నెత్తిన పెట్టుకుంటారు మ‌న ఆడియ‌న్స్‌.

తెలుగు చిత్రాల‌కు దీటుగా వాటికి ఓపెనింగ్స్ ఇవ్వ‌డం.. టాక్ బాగుంటే వ‌సూళ్ల పంట పండించడం మ‌న ప్రేక్ష‌కుల‌కే చెల్లింది. ఇది చూసి వేరే భాష‌ల్లో, ముఖ్యంగా త‌మిళం నుంచి కాస్త పేరున్న ప్ర‌తి సినిమానూ తెలుగులోకి దించేస్తుంటారు.

క్రిస్మ‌స్ కానుక‌గా శుక్ర‌వారం మ‌న ద‌గ్గ‌ర ధ‌మాకా, 18 పేజెస్ లాంటి రెండు పేరున్న సినిమాలు రిలీజ‌వ‌తున్నా స‌రే.. ముందు రోజు లాఠీ, క‌నెక్ట్ అనే రెండు త‌మిళ అనువాదాలు కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజ‌య్యాయి.

ఈ ఒక్క రోజుకు వాటికి కోరుకున్న దాని కంటే ఎక్కువ స్క్రీన్లే ఇచ్చారు. ఐతే విశాల్ సినిమా ఎలా ఉందో చూద్దామ‌ని మాస్ ప్రేక్ష‌కులు.. న‌య‌న్ మూవీపై ఓ లుక్కేద్దామ‌ని హార్ర‌ర్ ప్రేమికులు థియేట‌ర్ల‌కు వెళ్లి షాక్ తిన్నారు.

ఎప్ప‌ట్నుంచో చూస్తున్న రొటీన్ పోలీస్ స్టోరీనే లాఠీ సినిమాలో కూడా వ‌డ్డించించింది విశాల్ అండ్ టీం. ఒక ద‌శ వ‌ర‌కు క‌థాక‌థ‌నాలు ఆస‌క్తిక‌రంగానే సాగినా.. స‌గం నుంచి సినిమా గాడి త‌ప్పింది. ఓవ‌ర్ డోస్ యాక్ష‌న్ సీన్లు ప్రేక్ష‌కుల‌కు విసుగు తెప్పించేశాయి.

ద్వితీయార్ధం అంతా ఒక బిల్డింగ్ ఫైట్ మీద న‌డిపించ‌డంతో సినిమా ఎప్పుడ‌వుతుందా అని ఎదురు చూడ్డం ప్రేక్ష‌కుల వంతైంది. మ‌రీ వంద‌ల మందిని హీరో ఢీకొట్టి పైచేయి సాధించ‌డం అన్న‌ది టూమ‌చ్ అంటే టూమ‌చ్‌. యాక్ష‌న్‌కు తోడు సెంటిమెంట్ కూడా ఓవ‌ర్ డోస్ అయిపోయి ప్రేక్ష‌కులు త‌ల‌లు ప‌ట్టుకుని థియేట‌ర్ల నుంచి బ‌య‌టికి వ‌చ్చేలా చేశాయి. ఇక న‌య‌న‌తార సినిమా క‌నెక్ట్ విష‌యానికి వ‌స్తే.. ట్రైల‌ర్లో ఇచ్చిన బిల్డ‌ప్ సినిమాలో లేదు.

ఇంట‌ర్వెల్ లేకుండా గంట‌న్న‌ర పాటు నాన్‌స్టాప్ హార్ర‌ర్‌తో ఊపేయ‌బోతున్న‌ట్లుగా సంకేతాలిచ్చారు కానీ.. సినిమాలో చిల్లింగ్ మూమెంట్స్ పెద్ద‌గా లేవు. క‌రోనా-లాక్ డౌన్ నేప‌థ్యం త‌ప్పిస్తే ఇదొక రొటీన్ హార్ర‌ర్ స్టోరీనే. త‌క్కువ నిడివి అయినా సాగ‌తీత‌గా, బోరింగ్‌గా అనిపించిందంటే సినిమా ప‌రిస్థితేంటో అంచనా వేయొచ్చు. మొత్తంగా ఈ రోజు ఏదో ఆశించి డ‌బ్బింగ్ బొమ్మ‌లు చూడ్డానికి వెళ్లిన ప్రేక్ష‌కుల‌కు గ‌ట్టి దెబ్బే త‌గిలింది.