సంక్రాంతి రేసులో బాలీవుడ్ శునక సినిమాలు

సంక్రాంతికి ఇంకో ఇరవై రోజులు మాత్రమే ఉంది. థియేటర్లకు సంబంధించిన వివాదం ఇంకా కొలిక్కి రాలేదు కానీ మొత్తం లిస్టు బయటికి వస్తే కానీ అసలేం జరుగుతోందో ఇండస్ట్రీ వర్గాలకు సైతం అర్థం కాని పరిస్థితి నెలకొంది. మైత్రి నిర్మాతలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల చివరి దశ పనుల్లో బిజీగా ఉండగా వారసుడు తమిళ వెర్షన్ ఆడియో ఈవెంట్ పనుల్లో దిల్ రాజు తలమునకలై ఉన్నారు. అజిత్ మాత్రం కూల్ గా తెగింపు పోస్టర్ రిలీజ్ చేయడం తప్ప చేసిందేమి లేదు. ఒరిజినల్ లో ఓ రెండు లిరికల్ వీడియోస్ వచ్చాయి. కళ్యాణం కమనీయం ఒక సాంగ్ రిలీజ్ కాగా విద్య వాసుల అహం ఇంకా పబ్లిసిటీ స్టార్ట్ చేయలేదు.

సరే మనకే స్క్రీన్లు సరిపోక కిందామీదా పడుతుంటే ఓ రెండు బాలీవుడ్ సినిమాలు వీటికి తోడవుతున్నాయి. అది కూడా ఒకే రోజు కావడం మరో ట్విస్టు. అందులో మొదటిది కుత్తే. అంటే అర్థం కుక్కలు. క్యాస్టింగ్ ఆసక్తికరంగానే ఉంది. అర్జున్ కపూర్, టబు, నసీరుద్దీన్ షా లాంటి తారాగణం బాగానే సెట్ చేశారు. డబ్బుకి ఆశపడిన పోలీస్ ఆఫీసర్స్ గ్యాంగ్ తో మాఫియా ముఠా పోరాటాన్ని ఇందులో తీసుకున్నారు. రెండోది లకడ్ బగ్గా. అంటే తోడేలు టైపు జంతువు. మరీ పేరున్న ఆర్టిస్టులు లేరు కానీ దీని క్యాప్షన్ కూడా కుక్కలను ఆధారంగా చేసుకునే పెట్టారు. థీమ్ ఆసక్తికరంగానే ఉంది

ఈ రెండూ జనవరి 13నే వస్తున్నాయి. అంటే వాల్తేరు వీరయ్య తేదీకి. వీళ్ళ వరస చూస్తుంటే సౌత్ మార్కెట్ లో ఆడకపోయినా పర్లేదని డిసైడ్ అయినట్టు ఉన్నారు. ఎందుకంటే తమిళనాడు కేరళలో విజయ్ అజిత్ ల డామినేషన్ ఉంటే ఏపీ తెలంగాణలో చిరంజీవి బాలయ్యల ఆధిపత్యం ఉంటుంది. అలాంటప్పుడు వీటిని పట్టించుకునేదెవరు. పైగా వారసుడు, తెగింపు హిందీ వెర్షన్లు కూడా డబ్ అవుతున్నాయి. అలాంటప్పుడు రిస్క్ చేయడం ఎందుకు. నార్త్ ఆడియన్సే హిందీ సినిమాలను పట్టించుకోనప్పుడు ఇలా అనవసరంగా పోటీకి చేటు చేసుకుంటారా. తెలిసి మునిగేవాడిని ఎవరాపగలరు.