తెలుగు టైటిల్ పెడతారట.. సంతోషం

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ చివరి సినిమాకు తమిళంలో ‘వలిమై’ అనే టైటిల్ పెట్టారు. దానికి బలం అని అర్థం. అదే టైటిల్ తెలుగులో పెట్టి ఉండొచ్చు. లేదంటే ‘పవర్’ లాంటి ఇంగ్లిష్ టైటిల్ పెట్టినా ఓకే. కానీ తమిళ టైటిల్‌‌నే తెలుగులో పెట్టి రిలీజ్ చేసే సాహసం చేశారు. ఇది తెలుగు ప్రేక్షకులను అవమానించడం కాక మరేంటి? హీరో పేరు తమిళంలో ఉండి.. అదే టైటిల్‌తో తెలుగులో రిలీజ్ చేసినా కొంచెం అర్థం చేసుకోవచ్చు.

కానీ ఇలా మన వాళ్లకు అర్థం తెలియని తమిళ పదాన్ని టైటిల్‌గా పెట్టి రిలీజ్ చేయడం టూమచ్. ఈ విషయంలో అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమిళంలో బ్లాక్‌బస్టర్ అయిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఐతే సినిమాలో విషయం కూడా అంతంతమాత్రం అన్నది వేరే విషయం. ఆ సినిమా రిలీజ్ టైంలో ఇందులో విలన్ పాత్ర పోషించిన కార్తికేయను టైటిల్‌ గురించి అడిగితే అర్థం లేని వివరణ ఏదో ఇచ్చాడు.

కట్ చేస్తే ఇప్పుడు అజిత్ కొత్త సినిమా ‘తునివు’ కూడా తెలుగులో రిలీజ్ కాబోతోంది. సంక్రాంతికి తెలుగులో భారీ చిత్రాల మధ్య ఆ సినిమాకు చిన్న రిలీజే దక్కబోతోంది. అయినప్పటికీ తెలుగు మార్కెట్‌ను లైట్ తీసుకోకుండా, ‘వలిమై’కు ఎదురైన అనుభవాన్ని గుర్తుపెట్టుకుని.. ఈ చిత్రానికి తెలుగు టైటిలే పెడుతున్నట్లు సమాచారం. ‘తునివు’ అంటే ధైర్యం అని అర్థం.

ఆ టైటిల్‌తో తెలుగులో ఆల్రెడీ ఓ డిజాస్టర్ మూవీ ఉన్న నేపథ్యంలో ‘తెగింపు’ అనే టైటిల్‌తో సినిమాను రిలీజ్ చేయబోతున్నారట. ఏదైతేనేం ‘వలిమై’ లాగా తమిళ టైటిల్‌తో సినిమాను దించి మన వాళ్లకు మంటెత్తించకుండా చేశారు సంతోషం. ఈ చిత్ర తెలుగు డబ్బింగ్ హక్కులను కేవలం మూడు కోట్లకే ఇచ్చేసినట్లు సమాచారం. వాల్తేరు వీరయ్య, వీరసింహరెడ్డిలకు తోడు ‘వారసుడు’ కూడా తెలుగులో పెద్ద స్థాయిలోనే రిలీజ్ కాబోతోంది. దీంతో అజిత్ సినిమాను తక్కువకే ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలుగు టైటిల్ రివీల్ చేసి ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నారిక్కడ.