‘ఖుషి’లో కొత్త హీరోయిన్?


విజయ్ దేవరకొండ, సమంతల క్రేజీ కాంబినేషన్లో మొదలైన ‘ఖుషి’ చిత్రానికి ఆరంభంలో మంచి హైపే వచ్చింది. ‘టక్ జగదీష్’తో శివ నిర్వాణ నిరాశ పరిచినప్పటికీ తనకు పట్టు ఉన్న లవ్ స్టోరీ జానర్లో ‘ఖుషి’ని తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా కచ్చితంగా మంచి ఫలితాన్ని అందుకుంటుందనే అభిప్రయాలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమాను ప్రకటించిన కొన్ని రోజులకే షూటింగ్ మొదలుపెట్టేశారు. చకచకా కొన్ని షెడ్యూళ్లు పూర్తయ్యాయి. కానీ ఆ తర్వాత అనూహ్యంగా షూటింగ్‌కు బ్రేకులు పడిపోయాయి.

‘లైగర్’ ప్రమోషన్లు, రిలీజ్ హడావుడి వల్ల విజయ్ బ్రేక్ తీసుకోగా.. సమంత సైతం ‘యశోద’ బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయడం కోసం అటు మళ్లింది. ఇంతలో సమంతకు అనారోగ్య సమస్య తలెత్తి ఆమె షూటింగ్‌లకు అందుబాటులో లేకుండా పోయింది. సమంత ప్రస్తుతం కోలుకుంటున్నప్పటికీ ఇప్పుడిప్పుడే షూటింగ్‌కు రావడం కష్టం అంటున్నారు.

ఈలోపు ‘ఖుషి’ సినిమాలోకి కొత్త హీరోయిన్ వచ్చిందన్న సమాచారం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సమాచారం వినగానే సమంతను తప్పించి వేరే అమ్మాయిని ఎంచుకున్నారేమో అన్న అనుమానం కలగొచ్చు కానీ.. అలాంటిదేమీ లేదట. ఈ చిత్రంలో మరో కథానాయికకు కూడా చోటుందని.. ఆ పాత్ర కోసం ‘ఉప్పెన’ భామ కృతి శెట్టిని ఎంచుకున్నారని సమాచారం. కృతిది ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని కూడా అంటున్నారు. ఇదెంత వరకు నిజమో చూడాలి. ఆమె ఈ సినిమాలో భాగం కావడం మాత్రం వాస్తవమేనట.

సమంత అందుబాటులో వచ్చేవరకు విజయ్, కృతి కాంబినేషన్లో సీన్లు తీసే అవకాశం ఉందని సమాచారం. సమంత కొత్త ఏడాదిలో మళ్లీ కెమెరా ముందుకు రావచ్చని అంచనా వేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 23న రిలీజ్ చేయాలని అనుకున్నారు. షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది.