పవన్ అభిమానుల్లో లోలోన సందేహం

ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించే చర్చంతా. ‘రన్ రాజా రన్’ లాంటి సూపర్ హిట్‌‌తో దర్శకుడిగా పరిచయం అయి.. ఆ తర్వాత ‘సాహో’ లాంటి భారీ చిత్రంతో నిరాశ పరిచిన సుజీత్ డైరెక్షన్లో పవన్ కొత్త చిత్రాన్ని ఈ రోజు అనౌన్స్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రం తర్వాత డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ప్రి లుక్ పోస్టర్‌ను డిజైన్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

అభిమానులు ఉదయం నుంచి ఆ పోస్టర్‌ను డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. అన్ని విశ్లేషణలు అయ్యాక తేలిందేమంటే.. ఇది మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టర్‌ మూవీ అని. పోస్టర్ మీద జపాన్ అక్షరాలు.. బుద్ధ విగ్రహం అవీ చూసి సినిమా జపాన్‌ నేపథ్యంగా నడుస్తుందేమో అని కూడా చర్చించుకుంటున్నారు. ‘సాహో’ నిరాశపరిచి ఉండొచ్చు కానీ.. సుజీత్ సాధారణ దర్శకుడైతే కాదు. పవన్‌ కళ్యాణ్‌ను డిఫరెంట్‌గా, పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేయగలడని అభిమానులు నమ్ముతున్నారు.

‘పంజా’ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అయినా.. అందులో పవన్ లుక్స్, మేనరిజమ్స్, స్టైలిష్ యాక్షన్ బ్లాక్స్‌‌ను అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ఈసారి పవన్‌ను అంతే స్టైలిష్‌గా చూపిస్తూ లోపాల్లేని గ్యాంగ్‌స్టర్ మూవీని సుజీత్ అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ సినిమాకు పవన్ ఎప్పుడు కాల్ షీట్లు ఇస్తాడన్నదే ప్రశ్నార్థకంగా మారింది.

ఈ సినిమా ఇప్పుడిప్పుడే మొదలవ్వదేమో అని ఫ్యాన్స్ సందేహిస్తున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికల సంకేతాలు వస్తున్న నేపథ్యంలో పవన్ మరి కొన్ని నెలల్లో పూర్తి స్థాయిలో రాజకీయ రణరంగంలోకి దిగాల్సింది. మూణ్నాలుగు నెలల తర్వాత సినిమాల నుంచి బంధాన్ని కట్ చేసుకోక తప్పదు. ఆ లోపు ‘హరిహర వీరమల్లు’ను పూర్తి చేస్తే ఎక్కువ అన్నట్లుంది పరిస్థితి. అది పూర్తి చేసి సుజీత్ మూవీని కూడా పట్టాలెక్కిస్తే జనాలు ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు.

పవన్‌కు రాజకీయాలపై చిత్తశుద్ధి లేదని విమర్శిస్తారు. 2024 ఎన్నికలకు పవన్‌కు చాలా కీలకం కాబట్టి ఆయన సినిమాల నుంచి సాధ్యమైనంత త్వరగా కనెక్షన్ కట్ చేసుకోవడం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల మంుదు ఇంకో సినిమా చేయడం కష్టమని హరీష్ శంకర్ సినిమానే పక్కన పెట్టించిన పవన్‌.. ఇక సుజీత్ సినిమాను ఎందుకు అనౌన్స్ చేయించాడన్నది అర్థం కావడం లేదు. కేవలం అనౌన్స్‌మెంట్ వరకు ఇప్పుడు చేసి హరీష్ సినిమాతో పాటు దీన్ని కూడా 2024 ఎన్నికల తర్వాతే చేస్తాడేమో అని కూడా అభిమానులు అంచనా వేస్తున్నారు.