‘సమంత’కు ఇది చాలా పెద్ద కాంప్లిమెంటే..

సౌత్ ఇండియాలోనే కాదు.. మొత్తం ఇండియాలో ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరు సమంత. పెద్ద పెద్ద సినిమాల్లో నటించడం వల్ల, టాప్ స్టార్లతో జత కట్టడం వల్ల ఆమెను టాప్ హీరోయిన్ అనేయలేం. సొంతంగా విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకుని వేరే హీరోయిన్లు అందుకోలేని స్థాయికి చేరుకుంది సామ్. లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ఒంటి చేత్తో నిలబెట్టగల సామర్థ్యం ఆమె సొంతం. యు టర్న్, ఓ బేబీ, యశోద లాంటి చిత్రాలకు ఆమె పేరు మీదే బిజినెస్ జరిగింది.

ఆమె వల్లే వాటికి వసూళ్లు వచ్చాయి. ‘యశోద’ అయితే డివైడ్ టాక్‌ను తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడిందంటే సమంత స్టార్ పవరే కారణం. ఇప్పటికే ఎన్నో ఘనతలు, ప్రశంసలు అందుకున్న సమంతకు ఇప్పుడు అన్నింటికీ మించిన పెద్ద కాంప్లిమెంట్ లభించింది. ఆ కాంప్లిమెంట్ ఇచ్చింది లెజెండరీ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, సురేష్ బాబు కావడం విశేషం.

‘ఆహా’లో నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న ‘అన్‌స్టాపబుల్-2’ షోకు అతిథులుగా హాజరైన అరవింద్, సురేష్ బాబులకు బాలయ్య చిన్న టాస్క్ ఇచ్చాడు. ప్రస్తుత తరంలో మహానటి అవ్వగల సామర్థ్యం ఎవరికి ఉందో చెప్పమంటూ ఆ పేరు రాసేందుకు వేర్వరుగా బోర్డులిచ్చాడు బాలయ్య. ఈ ప్రశ్నకు సమాధానంగా ఒకరికి తెలియకుండా ఒకరు సమంత పేరే రాయడం విశేషం. సమంత పేరు చూపిస్తూ.. ఇద్దరం మాట్లాడుకోకుండా ఒకే పేరు రాశం అంటూ అరవింద్ నవ్వేశారు. తర్వాత సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఉన్నవాళ్లలో అవ్వగలిగితే ఆ అమ్మాయి ఒక్కతే అవ్వగలదు. ఈ బ్యాచ్‌లో’’ అని చెప్పారు.

ఈ వీడియోను సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. స్వయంగా సమంత ఈ వీడియోపై స్పందిస్తూ హార్ట్ సింబల్‌ను కామెంట్ కింద పోస్ట్ చేసింది. అరవింద్, సురేష్ బాబు లాంటి లెజెండ్స్.. సమంతను మహానటిగా అభివర్ణించడం అంటే ఆమెకు ఇది చాలా పెద్ద కామెంట్ అన్నట్లే.