రాజ‌మౌళికి ఆస్కార్‌.. కొట్టిపారేయ‌లేం

ఈసారి ఆస్కార్ అవార్డుల‌కు భార‌త్ నుంచి ఆర్ఆర్ఆర్ సినిమానే నామినేట్ అవుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ జ్యూరీ మ‌రోలా ఆలోచించింది. ఒక గుజ‌రాతీ చిన్న చిత్రాన్ని అవార్డుల‌కు దేశం త‌ర‌ఫున నామినేట్ చేసింది. అయినా స‌రే ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ దారులేమీ మూసుకుపోలేదు.

చిత్ర బృందం సొంతంగా వివిధ విభాగాల్లో సినిమాను అకాడ‌మీ అవార్డుల‌కు నామినేట్ చేసుకుంది. రాజ‌మౌళి అండ్ టీం నెల రోజుల‌కు పైగా అమెరికాలో మ‌కాం వేసి కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టుకుని ఆస్కార్ జ్యూరీని మెప్పించేలా క్యాంపైనింగ్ చేసింది.

ఇది ఆస్కార్ అవార్డుల ముంగిట రొటీన్‌గా జ‌రిగే తంతే. ఎవ‌రి సినిమాల‌ను వాళ్లు స్క్రీనింగ్ ఏర్పాటు చేయించుకుని ప్ర‌మోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేమీ లాబీయింగ్ కాదు. కాగా ఆర్ఆర్ఆర్ టీం ఇంత క‌ష్ట‌ప‌డుతున్నా.. నిజంగా మ‌న సినిమాను ఆస్కార్ జ్యూరీ గుర్తిస్తుందా అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ అవార్డు రావ‌డానికి వాస్త‌విక‌మైన అవ‌కాశాలు ఎంత అనే విష‌యంలో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. ఐతే మిగ‌తా విభాగాల మాటేమో కానీ.. రాజ‌మౌళికి ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా ఆస్కార్ పుర‌స్కారం ద‌క్కితే ఆశ్చ‌ర్యం ఏమీ లేద‌న్న‌ది అమెరిక‌న్ మీడియా మాట‌.

ఎందుకంటే తాజాగా ఆయ‌న‌కు న్యూయార్క్ న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా పుర‌స్కారం క‌ట్ట‌బెట్టారు. ఇదేమీ ఆషామాషీ అవార్డు కాదు. ఈ అవార్డు అందుకున్న 22 మంది ద‌ర్శ‌కుల్లో 16 మంది త‌ర్వాత ఆస్కార్ పుర‌స్కారం కూడా ద‌క్కించుకున్నార‌ట‌.

ఆ లెక్క‌న రాజ‌మౌళి ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా అకాడ‌మీ అవార్డు అందుకోవ‌డానికి మెండుగా అవ‌కాశాలు ఉన్న‌ట్లే. ప్ర‌ఖ్యాత హాలీవుడ్ ప్ర‌ముఖులు, సినీ విశ్లేష‌కులు ఎంతోమంది ఆర్ఆర్ఆర్‌లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌ను కొనియాడారు కాబ‌ట్టి జ‌క్క‌న్న‌ను ఈ అత్యున్న‌త పుర‌స్కారం వ‌రిస్తుంద‌ని ఆశిద్దాం.