ఒక కల్ట్ క్లాసిక్ ఇచ్చిన దర్శకుడు ఏడేళ్ల గ్యాప్ తర్వాత సినిమా ఇస్తే దాని మీద అంచనాలు ఎలా ఉంటాయో వేరే చెప్పాలా. 2015లో ప్రేమమ్ అనే యూత్ ఫుల్ ఎమోషనల్ జర్నీతో ఆకట్టుకున్న దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్. ఎలాంటి కమర్షియల్ మసాలాలు లేకుండా కేవలం లవ్ సబ్జెక్టుని తెరకెక్కించిన తీరు కేరళ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. నాగ చైతన్య రీమేక్ చేసుకుని హిట్టు కొట్టినా ఒరిజినల్ వెర్షన్ స్థాయిలో మేజిక్ చేయలేదన్నది వాస్తవం. అలాంటి ఆల్ఫోన్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత గోల్డ్ తో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది కూడా మంచి క్రేజీ కాంబినేషన్ తో.
గోల్డ్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్. ఇతని ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. అంతకన్నా తెలుగు తమిళ ఆడియన్స్ ని ఆకట్టుకున్న విషయం నయనతార హీరోయిన్ కావడం. ఇంకేం హైదరాబాద్ లోనూ మార్నింగ్ షోకు ఫ్యాన్స్ క్యూ కట్టేశారు. స్టార్ క్యాస్టింగ్ తో ఆల్ఫోన్స్ ఈసారి ఇంకెలాంటి అద్భుతం చేశాడోనని ఆతృతతో థియేటర్లో అడుగు పెట్టారు. తీరా చూస్తే గోల్డ్ జనాల సహనంతో ఓ రేంజ్ లో ఫుట్ బాల్ ఆడేసింది. మూడు గంటలకు పది నిమిషాల నిడివి తక్కువున్న ఈ ల్యాగ్ షోలో విపరీతమైన సాగతీత ఎప్పుడెప్పుడు బయటికి వెళ్లిపోదామా అనేలా చేసింది.
స్లో మోషన్ షాట్లు, అవసరానికి మించిన ల్యాగ్ ఎమోషన్లు, పేలని కామెడీ, తానో గొప్ప టెక్నీషియనన్న మితిమీరిన అంచనాతో తన సాంకేతిక ప్రతిభనంతా చూపించే తపన మొత్తానికి గోల్డ్ ని గిల్ట్ గా మార్చేసింది. అసలు ట్విస్టు పోస్టర్లలో అంత బిల్డప్ ఇచ్చుకున్న నయనతారకున్న సీన్లు పట్టుమని నాలుగైదు కూడా లేవు. అంటే ఆ రకంగా కూడా మోసం జరిగిందన్న మాట. ప్రమోషన్ల టైంలో పృథ్విరాజ్ తో సహా అందరూ ఎందుకు సైలెంట్ గా ఉన్నారో సినిమా చూశాక అర్థమయ్యింది. ప్రతి మలయాళ మూవీని ఏదో కళాఖండంగా ఫీలయ్యే వాళ్ళు మాత్రం గోల్డ్ ని తప్పక చూడాలి.